నాన్న దొంగ.. కొడుకులు డాక్టర్‌, ఇంజనీర్‌!

12 Apr, 2018 15:51 IST|Sakshi
టక్‌-టక్‌ దొంగల ముఠా.. ఇన్‌సెట్‌లో రవిచంద్రన్ ముదలియార్

ముంబై: తండ్రి దొంగ.. కొడుకులు మాత్రం డాక్టర్‌, ఇంజనీర్‌! ఇది ఏదో సినిమా స్టోరిలా ఉంది కదా! కానీ ఇది నిజం. ఈ వింత కేసును ముంబై పోలీసులు ఎదుర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. అతనో దొంగ. పేరు రవిచంద్రన్ ముదలియార్. కార్లలో విలువైన వస్తువులు, మొబైల్స్, నగదు అపహరించే టక్-టక్ దొంగల ముఠాకు అతడు నాయకుడు. ఓ దొంగతనం కేసులో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణ చేపట్టిన పోలీసులకు ముదలియార్ చుక్కలు చూపించాడు. తనకు హిందీ రాదని, తమిళం మాత్రమే వచ్చని నమ్మబలికాడు. దీంతో పోలీసులు తమదైన రీతిలో విచారించడం మొదలుపెట్టారు.

అతడి నేపథ్యం గురించి ఆరా తీశారు. అసలు విషయం తెలుసుకొని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ముదలియార్‌కు ఓ భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. ముగ్గురిలో మొదటి వ్యక్తి నవీ ముంబైలో ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్. ఎమ్మెస్ చేస్తున్నాడు. రెండో కొడుకు ఓ ఇంజినీర్ కాగా.. మూడో కొడుకు హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతున్నాడు. వాళ్లంతా నవీ ముంబైలో నివాసముంటున్నారు. 

ఇక టక్‌-టక్‌ దొంగల ముఠా కూడా వెరైటీగా దొంగతనాలు చేస్తుంది. రోడ్డుపై వెళ్లే వాహనాలే వీరి టార్గెట్‌. రోడ్డు మీద ప్రయాణిస్తున్న కార్లను ఆపి, ఇంధనం లీక్ అవుతుందని లేదా ఏదైనా ప్రమాదం జరిగిందని నమ్మబలుకుతారు. దీంతో వాహనంలో ఉన్నవారు దాన్ని నిలిపివేసి బయటకు వచ్చి పరిశీలించే సమయంలో అందులో విలువైన వస్తువులు, నగలు తీసుకొని పారిపోతారు. 

ఇటీవల దక్షిణ ముంబైకి చెందిన ఓ మహిళ కారులో ప్రయాణిస్తుండగా ఆపి, వాహనం నుంచి ఇంధనం కారుతుందని చెప్పి, అందులోని నగలు దొంగిలించారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముదిలియార్‌తో పాటు నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా