ఏం కష్టం వచ్చిందో.. 

10 Dec, 2019 09:11 IST|Sakshi
వేర్వేరు చోట్ల ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థులు

నేలరాలిన విద్యా కుసుమాలు 

వేర్వేరు చోట్ల ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య 

ఒకరు ట్రైన్‌ కింద పడి.. మరొకరు ఉరివేసుకొని 

జిల్లాలోని వేర్వేరు చోట్ల ఇద్దరు విద్యార్థులు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకరు రైలు కింద పడి..మరొకరు ఉరివేసుకొని మృతి చెందారు. ఎంతో భవిష్యత్‌ ఉన్న వీరు అర్ధంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇద్దరి విద్యార్థుల మృతికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు.   

టెక్కలి రూరల్‌: మండలంలోని నౌపడ రైల్వే స్టేషన్‌ సమీపంలో సోమవారం పాలిటెక్నిక్‌ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్కలి కొడ్రవీధికి చెందిన కంచుమోజు వంశీ (18) డిప్లమో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలకు వెళతానని చెప్పి నౌపడ ఆర్‌ఎస్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. ఏ రైలు వస్తుందని అక్కడ ఉన్నవారిని అడిగాడు. హౌరా మెయిల్‌ వస్తుందని చెప్పడంతో కొంత సమయం వేచి ఉన్నాడు. రైలు దగ్గరకు వచ్చే సరికి పట్టాలపైకి దూకి తలపెట్టాడు. అతని పైనుంచి రైలు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. యూనిఫాం ఆధారంగా కళాశాలకు ఈ విషయం తెలియజేశారు. స్నేహితులు ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన వ్యక్తి వంశీగా గుర్తించారు. మృతుని కుటుంబ సభ్యులకు కళాశాల సిబ్బంది సమాచారం చేరవేశారు. ఎందుకు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడో కారణం తెలియడం లేదని, ఎంతో అల్లారుముద్దుగా పెంచామని తల్లిదండ్రులు మల్లేష్‌, శ్రీదేవి కన్నీరుమున్నీరుగా విలిపించారు. మృతుడికి అన్నయ్య పవన్‌ ఉన్నాడు. కొడ్రవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి.  

పెద్దలక్ష్మీపురంలో..  
పాతపట్నం: మెళియాపుట్టి మండలం పెద్దలక్ష్మీపురం గ్రామానికి చెందిన డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యారి్థని తెంబూరు పుణ్యవతి (19) ఇంటిలో ఉరివేసుకుని సోమవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాహితీశ్రీ డిగ్రీ కళాశాలలో పుణ్యవతి చదువుతోంది. ప్రతి రోజూ కళాశాలకు పెద్దలక్ష్మీపురం నుంచి బస్సులో వెళ్లివస్తోంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఇంటి వద్ద నుంచి కళాశాలకు బయలుదేరింది. కళాశాలలో తరగతులు జరుగుతుండగా మధ్యలో ప్రిన్సిపాల్‌ రమేష్‌ వద్దకు వెళ్లి కడుపునోప్పిగా ఉందని, ఇంటికి వెళతానని  చెప్పింది. ఇంటికి వచ్చింది ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు సింహాచలం, ఇందిరా పొలం పనికి వెళ్లారు. తండ్రి ఇంటికి వచ్చి చూసి వెంటనే ఆటోలో చాపర పీహెచ్‌సీ తీసుకెళ్లాడు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలపడంతో పోస్టుమార్టం కోసం పాతపట్నం సీహెచ్‌సీకి తరలించారు. ఇంటి వద్ద బాగానే ఉందని, కళాశాలలో ఏం జరిగిందో తెలియదని తల్లిదండ్రులు, గ్రామస్తులు అంటున్నారు. పుణ్యవతి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సిద్ధార్థ కుమార్‌ తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా