'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' పేరిట మోసం 

12 Jul, 2019 08:24 IST|Sakshi

సాక్షి, అల్లిపురం(విశాఖ దక్షిణ) : కౌన్‌ బనేగా కరోడ్‌పతి పేరిట రూ.2.26లక్షలు సైబర్‌ నేరగాళ్లు స్వాహా చేసిన ఘటనపై బుధవారం సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. సీఐ వి.గోపినాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నంలో రామలక్ష్మీ కాలనీకి చెందిన జె.దేవి అనే యువతికి జూన్‌ 5వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్‌ వచ్చింది. అవతలి వ్యక్తి ఆమెతో తనను తాను పరిచయం చేసుకున్నాడు.

తాను కౌన్‌ బనేగా కరోడ్‌పతి, ప్రధాన కార్యాలయం నుంచి ఫోన్‌ చేస్తున్నాను.మీరు కౌన్‌ బనేగా కరోడ్‌పతిలో లక్కీ లాటరీ ద్వారా రూ.25లక్షలు గెలుపొందారని, మీ లాటరీ నంబరు 8991 అని, మీ డిటెయిల్స్‌ వాట్సప్‌ చేయమని కోరాడు. ఈ మేరకు బాధితురాలు తన వివరాలను వాట్సప్‌ చేసింది. దీంతో ఈ లక్కీడ్రాలో మీతో పాటు 44 మంది ఉన్నారని, మీకు బహుమతిగా వచ్చిన మొత్తం క్లెయిమ్‌ చేసుకోవడానికి జీఎస్‌టీ కట్టాలని, టాక్స్‌ క్లెయిమ్‌ చేయాలని, ఇన్సూరెన్స్‌ కట్టాలని చెప్పి విడతల వారీగా రూ.2.26లక్షలు అతని అకౌంట్‌లో బాధితురాలితో వేయించుకున్నాడు. తరువాత కూడా మరికొంత సొమ్ము కావాలని డిమాండ్‌ చేయడంతో బాధితురాలికి అనుమానం వచ్చింది. దీంతో ఆమె బుధవారం సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వి.గోపినాథ్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు