పరీక్ష సరిగా రాయలేదని..

21 Dec, 2019 09:17 IST|Sakshi
సురేష్‌ (ఫైల్‌)

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

మల్కాజిగిరి: ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ యువకుడు పరీక్ష సరిగా రాయలేదని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ హరీష్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా, పొందూరు మండలం ఎల్లయ్యవారిపేటకు చెందిన సురేష్‌(26) పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఈ నెల 14న జరిగిన జూనియర్‌ లైన్‌మెన్‌ పరీక్ష రాసేందుకు హైదరాబాద్‌కు వచ్చిన అతను  షేక్‌పేట్‌లోని ఒయాసిస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో పరీక్షకు హాజరయ్యాడు. అనంతరం తన సోదరుడు రమేష్‌కు ఫోన్‌చేసి మల్కాజిగిరిలో ఉంటున్న స్నేహితుడు రమేష్‌నాయుడు వద్దకు వెళుతున్నట్లు చెప్పాడు.

అదే రోజు మరోసారి రమేష్‌కు ఫోన్‌ చేసిన సురేష్‌  ఖర్చుల కోసం చర్లపల్లిలో ఉంటున్న  తన మామ శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకుని వస్తానని చెప్పాడు. 19న మధ్యాహ్నం సురేష్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందడంతో రమేష్, శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో అతను సురేష్‌ ఉంటున్న ఇంటి వద్దకు వచ్చి చూడగా సురేష్‌ ఫినాయిల్‌ తాగి, లక్ష్మణరేఖ పొడి తిని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించాడు. శ్రీనివాస్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు, పరీక్ష సరిగా రాయలేదని మనస్తాపంతోనే సురేష్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.

మరిన్ని వార్తలు