ఉద్యోగం పేరిట మోసం..

17 Oct, 2017 12:23 IST|Sakshi
ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి సమస్య వివరిస్తున్న రాజేశ్వరి,నకిలీ నియామకపత్రం చూపిస్తున్న బాధితురాలు

బాధితురాలి నుంచి రూ. లక్ష తీసుకున్న జెడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు నకిలీ ఆర్డరిచ్చి చేతులు దులుపుకున్న వైనం

లబోదిబోమంటున్న బాధిత మహిళ

కురుపాం: ఉద్యోగం పేరుతో ఓ  గిరిజన మహిళ నుంచి లక్ష రూపాయలు స్వాహా చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జెడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు రంజిత్‌కుమార్‌ తన దగ్గర డబ్బులు తీసుకుని నకిలీ ఆర్డరిచ్చి మోసం చేశాడని బాధితురాలు విలేకరులు, కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి వద్ద సోమవారం గోడు వెళ్ల్లబోసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మొండెంఖల్‌కు చెందిన పైల రాజేశ్వరి అనే గిరిజన మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని అదే గ్రామానికి చెందిన  టీడీపీ నాయకుడు, జెడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు రంజిత్‌కుమార్‌ నమ్మబలికాడు. అయితే ఇందుకు లక్ష రూపాయలు ఖర్చుఅవుతుందని చెప్పడంతో, బాధితురాలు డబ్బును రంజిత్‌కుమార్‌కు అప్పగించింది. దీంతో రాజేశ్వరిని విజయనగరం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో అడెంటర్‌గా నియమించినట్లు ఆర్డర్‌ కూడా ఇచ్చేశాడు. వెంటనే రాజేశ్వరి తన కుటుంబాన్ని విజయనగరానికి మార్చేసింది. అలాగే ఆర్డర్‌ పట్టుకుని జెడ్పీ కార్యాలయానికి వెళ్లగా ఆమెను విధుల్లోకి తీసుకున్నారు.

ఇక్కడే అసలు కథ...
ఉద్యోగంలో చేరిన రాజేశ్వరికి అధికారులు జీతం ఇవ్వలేదు. ఇలా ఏడు నెలల పాటు ఆమె ఉచితంగానే సేవలందించింది. చివరకు నెల రోజుల కిందట రూ. 15 వేలు ఇచ్చి వెళ్లిపొమ్మన్నారు. దీంతో బాధితురాలు లబోదిబోమంటూ సదరు   కో ఆప్షన్‌ సభ్యుడు రంజిత్‌కుమార్‌ వద్దకు వెళ్లి సమస్య వివరించింది. ఉద్యోగం లేనప్పుడు తన దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వాలని కోరగా ఇదుగో.. అదుగో.. అని చెబుతూ కాలయాపన చేస్తున్నాడు. వాస్తవానికి రాజేశ్వరికి ఇచ్చింది నకిలీ నియామకపత్రం. జెడ్పీలో సక్రమంగా విధులకు హాజరుకాని ఓ ఉద్యోగి స్థానంలో రాజేశ్వరిని తాత్కాలికంగా నియమించారు. ఏడు నెలలు పాటు పనిచేసిన తర్వాత అసలు ఉద్యోగి విధులకు హాజరుకావడంతో రూ. 15 వేలు ఇచ్చి రాజేశ్వరిని తప్పించారు. అటు ఉద్యోగం.. ఇటు డబ్బులు నష్టపోయిన తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది.

>
మరిన్ని వార్తలు