మద్యం దుకాణాలన్నీ జనావాసాల్లోకే!

2 Jul, 2017 04:11 IST|Sakshi
మద్యం దుకాణాలన్నీ జనావాసాల్లోకే!
కడప అర్బన్‌ : నిబంధనలు పక్కాగా పాటించాలంటే యజమానులు తప్పనిసరిగా షాపులను జనావాసాల్లోకి తీసుకు వెళ్లాల్సి వస్తోంది. అయితే అక్కడ స్థానికులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. నిబంధనలు పాటించకపోతే షాపు లైసెన్సులు కూడా రద్దు చేసేందుకు వెనుకాడబోమని అధికారులు ఓవైపు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ నూతన మద్యం విధానంలో ఒకవైపు యజమానులు, మరోవైపు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది. జిల్లాలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిబంధనలు అమలు చేస్తే చాలా మద్యంషాపులు అర్హత కూడా పొందలేవని, ఇప్పటికే ఒక జాబితాను ఎక్సైజ్‌ అధికారులు తయారుచేశారు. ఇవిగాక 31 మద్యం దుకాణాలను సుప్రీంకోర్టు నిబంధనల మేరకు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా నూతన మద్యం విధానంలో 255 మద్యం షాపులు ప్రారంభించాల్సి ఉంది. 
 
ప్రజల్లో వ్యతిరేకత.. దుకాణాల రద్దు 
సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి జనావాసాల మధ్య మద్యం దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటికే ప్రయత్నిస్తున్నారు. దీంతో స్థానిక ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది. కడప నగరంలోని రైతుబజార్‌ సమీపంలో ఏర్పాటు చేయాలనుకున్న మద్యం దుకాణానికి సంబంధించి ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఇప్పటికే రద్దుచేశారు. ఆ దుకాణాన్ని మరలా సంధ్య థియేటర్‌ సమీపంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం అక్కడికి చర్చి దగ్గరలో ఉందనీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇలాగే జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాల ఏర్పాటును స్థానికులు అడ్డుకుంటున్నారు. 
 
సుప్రీంకోర్టు నిబంధనలు ఇలా...
సుప్రీంకోర్టు మద్యం దుకాణాల ఏర్పాటు విషయంలో స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. జాతీయ రహదారులకు ఇరువైపులా రోడ్డు నుంచి 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణం ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ బడి, గుడి, మసీదు, చర్చిలు ఉండరాదు. వీటికి 100 మీటర్ల దూరం తప్పనిరిగా వుండాలి. మద్యం దుకాణం ఏర్పాటు చేసే గ్రామ పరిధిలో 20వేల జనాభాకుపైగా ఉంటే రహదారులకు 500 మీటర్ల దూరంలోను, 20 వేల లోపు జనాభా ఉంటే 220 మీటర్ల దూరంలోను మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి. 
 
నిబంధనలు పాటించక పోతే చర్యలు తప్పవు 
నూతన మద్యం విధానంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందే. నిబంధనలకు వర్తించని వాటిని ఇప్పటికే గుర్తించి తప్పనిసరిగా ఏర్పాటు చేసుకునే విధంగా సూచనలు చేశాం. ప్రజల్లో ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని అనిపిస్తే, తగిన కారణాలతో తమ దృష్టికి ఫిర్యాదులు తీసుకుని రావచ్చు. 
– డాక్టర్‌ ఏనుగుల చైతన్యమురళి, ఎక్సైజ్‌ డీసీ, కడప 
 
ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలా?
సుండుపల్లి: పీలేరు–సుండుపల్లి మార్గమధ్యంలోని పట్టణప్రాంతంలో పోలీస్‌స్టేషన్‌ సమీపాన జనావాసాల మధ్యలో మద్యందుకాణం ఏర్పాటుచేస్తుండటంతో స్థానిక మహిళలు, యువకులు ఆందోళన చేపట్టారు. శనివారం ఉదయం మద్యం దుకాణానికి ఇస్తున్న ఇంటి దగ్గర ధర్నా  నిర్వహించారు. సాయంత్రం సైతం ఆందోళన చేస్తుండటంతో తహసీల్దార్‌ సుబ్రమణ్యంరెడ్డి అక్కడకు చేరుకున్నారు. ఇళ్ల మధ్య మద్యందుకాణాలు ఎలా నిర్వహిస్తారని మహిళలు నిలదీశారు. అయితే ఒకవైపు పోలీస్‌స్టేషన్‌ మరొకవైపు ప్రైవేటు పాఠశాల, అదేవిధంగా స్త్రీశక్తిభవనం, ఎంపీడీఓ కార్యాలయం, వెటర్నరీ కార్యాలయాలు అతిదగ్గరలో ఉన్నాయని ఇక్కడ ఏర్పాటుచేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తమ సమస్యను వినతిపత్రం ద్వారా తెలిపారు.  
 
బ్రాందీషాపు వద్దని మహిళల రాస్తారోకో
రాజంపేట: పట్టణంలోని మన్నూరులో బ్రాందీషాపు ఏర్పా టు చేయవద్దని మహిళలు ఆందోళనకు దిగారు. శనివారం పట్టణ ప్రధానరహదారిపై  బైఠాయించారు. నివాసాల మధ్య మద్యంషాపు ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందని మహిళలు తెలిపారు. మహిళలు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో మన్నూరు పోలీసులు రంగప్రవేశం చేశారు. మహిళలతో చర్చించారు. ఫిర్యాదు చేస్తే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని సర్దిచెప్పడంతో వారు ఆందోళనను విరమింపచేశారు. ఆందోళనలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పూలభాస్కర్‌తోపాటు స్థానిక మహిళలు పాల్గొన్నారు. 
 
గుడి వెనుక... వైన్స్‌
కడప కార్పొరేషన్‌ : స్థానిక సంధ్యాహాల్‌ సర్కిల్‌లో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం 1949 నుంచి ఉంది. దీని పక్కనే పురాతన ఎస్‌పీజీ చర్చి కూడా ఉంది. సంధ్యా సర్కిల్‌లోని దేవాలయంలో శ్రీరామనవమి, హనుమత్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రైతుబజార్‌కు పోవాలన్నా, డాన్‌బోస్కో ఐటీఐ, గాయత్రీ కళాశాల, ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లాలంటే ఈ మార్గం గుండానే పోవాల్సి ఉండటంతో ఈ ప్రాంతంలో వైన్‌షాపుతో ఇబ్బందులు ఏర్పడుతాయని స్థానికులు హెచ్చరిస్తున్నారు. స్థానికులు, దేవాలయ భక్తుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండానే ఇక్కడ వైన్స్‌ ఏర్పాటు చేసేందుకు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారులు తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకపోవడంతో స్థానిక ప్రజలు, దేవాలయ భక్తులు కలెక్టర్‌ను కలవాలనే యోచనలో ఉన్నారు. అప్పటికీ న్యాయం జరగకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగేందుకు వారు సమాయత్తమవుతున్నారు. 
 
ఆర్‌ఎస్‌ రోడ్డులో ఇళ్ల మ«ధ్యలోనే...
ఆర్టీసీ బస్టాండు నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లే మార్గంలో ప్రకాష్‌నగర్‌ వద్ద బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేసేందుకు యత్నాలు సాగుతున్నాయి. నివాస గృహాల పక్కనే బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు అనుమతి ఇవ్వడంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవలే ఇద్దరు బాడుగకు ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి వేరొక చోటుకు వెళ్లిపోయినట్లు తెలిసింది.  
మరిన్ని వార్తలు