కోనసీమకు ఆక్వా మొబైల్ ల్యాబ్

19 Aug, 2015 22:17 IST|Sakshi

అమలాపురం రూరల్:తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా ఆక్వా సాగు జరిగే కోనసీమలో త్వరలో ఆక్వా మెుబైల్ ల్యాబ్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు రాష్ట్ర మత్య్సశాఖ కమిషనర్ రామ్‌శంకర్‌నాయక్ చెప్పారు. అమలాపురం క్షత్రియ కల్యాణమండపంలో బుధవారం జరిగిన జిల్లాస్థాయి ఆక్వా సదస్సులో అమలాపురంలో ఆక్వా ల్యాబ్ ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కమిషనర్‌ను కోరారు. ల్యాబ్ ఏర్పాటుకు ఎన్నో నిధులు, శాస్త్రవేత్తలు అవసరమని, ప్రస్తుతం తాత్కాలికంగా ఓ మెుబైల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసి 104 మాదిరిగా అన్ని గ్రామాలకు ల్యాబ్ సౌకర్యాలు అందేలా చర్యలు చేపడతామన్నారు.

ఈ సంచార ల్యాబ్ ఉదయం నుంచి రాత్రి వరకూ గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. రొయ్యలు, చేపలు, పీతల పెంపకందారులు సంఘాలుగా ఏర్పడితే ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ఆక్వా సాగుకు వరికి మాదిరిగానే సాగునీరిచ్చేలా ప్రభుత్వం ఇటీవల క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. అయితే వరి సాగుకు వాడగా మిగిలిన నీటినే ఆక్వా సాగుకు ఇస్తారని చెప్పారు. ఉప్పునీరు, మంచినీరు రొయ్యల పెంపకం రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నాణ్యమైన విత్తనాలతోపాటు ప్రభుత్వ రాయితీలు అందుతాయన్నారు.

మరిన్ని వార్తలు