టీడీపీలో బెట్టింగ్‌ బాబులు

27 Jul, 2017 01:22 IST|Sakshi
టీడీపీలో బెట్టింగ్‌ బాబులు

ముగ్గురు నేతల కోసం పోలీసుల అన్వేషణ
వారిని తప్పించేందుకు అధికార పార్టీ నేతల యత్నాలు
రంగంలోకి అమాత్యుని సన్నిహితుడు


నెల్లూరు : తెలుగుదేశం పార్టీలో బెట్టింగ్‌ బాబుల వ్యవహారం కలకలం రేపుతోంది. క్రికెట్‌ బెట్టింగ్‌ వెనుక నగరానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతలతోపాటు ఓ మాజీ కార్పొరేటర్‌ కుమారుడి హస్తం ఉందని నిర్ధారణకు వచ్చిన పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అధికార పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు నేతలు తెరచాటున క్రికెట్‌ బుకీలుగా వ్యవహరిస్తున్నారు. వారిద్దరికీ కీలక నాయకులతో సన్నిహిత సంబంధాలతోపాటు ఆర్థిక లావాదేవీలు కూడా ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో మంత్రికి సన్నిహితుడైన ఓ కీలక నాయకుడు రంగంలోకి దిగి వారిద్దర్ని తప్పించేందుకు యత్నిస్తున్నారు. టీడీపీ నేతల బెట్టింగ్‌ కార్యకలాపాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు నిర్వహించారు.

నగర తెలుగు యువత నేతతోపాటు ఆలయ మాజీ చైర్మన్‌ ఏడాదిగా బెట్టింగ్‌ కార్యకలాపాలను భారీ ఎత్తున నిర్వహించి నట్టు నిర్ధారించారు. వీరితో పాటు మాజీ కార్పొరేటర్‌ కుమారుడు సైతం ఈ కార్యకలాపాలు నిర్వహించినట్టు తేల్చారు. ఇతడు కొంతకాలంగా వీటికి దూరంగా ఉంటున్నట్టు చెబుతున్నారు. నగరానికి చెందిన ఒక కుటుంబం మాజీ కార్పొరేటర్‌ కుమారుడి వద్ద భారీగా బెట్టింగ్‌ కట్టి అప్పుల పాలయ్యారు. ఆ ఊబినుంచి బయటపడే మార్గం లేక నెల క్రితం ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం విది తమే.ఈ నేపథ్యంలో ముగ్గురి కోసం పోలీసులు అన్వేషణ మొదలైంది.

ఇతర ప్రముఖులతోనూ సంబంధాలు
పోలీసుల అదుపులో ఉన్న అంతర్జాతీయ క్రికెట్‌ బుకీ కృష్ణసింగ్‌కు టీడీపీ నేతలతోపాటు మరికొందరు ప్రముఖులతోనూ సంబంధాలు, బెట్టింగ్‌ లావాదేవీలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కృష్ణసింగ్‌ నేరుగా ముంబైలోని కీలక ఏజెంట్‌ ద్వారా నెల్లూరు జిల్లాతోపాటు మరో రెండు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఈ దృష్ట్యా జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతల్లో పలువురు అతడిని ఆర్థికంగా వినియోగించుకున్నారు.

పోలీసులపై ఒత్తిళ్లు
15 రోజుల క్రితం ఒకచోట జూద శిబిరం నిర్వహించగా.. అక్కడ కృష్ణసింగ్‌ ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు మెరుపుదాడి చేశారు. వారు దాడికి వస్తున్నారన్న సమాచారం కృష్ణసింగ్‌కు పోలీసు వర్గాల ద్వారా ముందుగానే తెలియడంతో అప్రమత్తమైన అతడు రాష్ట్రాన్ని వదిలి పారిపోయాడు. అతడి జాడ కనుక్కునేందుకు జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. వారం రోజులపాటు అతడి కోసం జల్లెడ పట్టిన పోలీసులు ఎట్టకేలకు వేరే రాష్ట్రంలో అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకొచ్చారు. కృష్ణసింగ్‌ను అక్కడి నుంచి తీసుకురావడానికి రెండు రోజుల సమయం పట్టింది.

ఈలోగా టీడీపీ నేతల నుంచి సింగ్‌కు ఒత్తిళ్లు వచ్చాయి. తమ పేర్లు బయట పెట్టవద్దని ఆ నేతలు హడావుడి చేసిన విషయాన్ని పోలీస్‌ బాస్‌ నిర్ధారించారు. అధికార పార్టీ నేతలే కాకుండా మరికొందరు ప్రముఖులకూ కృష్ణసింగ్‌తో బెట్టింగ్‌ లావాదేవీలు ఉన్నాయి. ఇదిలావుండగా.. కృష్ణసింగ్‌ను అదుపులోకి తీసుకున్న వెంటనే టీడీపీ నేతల నుంచి పోలీసులపైనా ఒత్తిళ్లు పెరిగాయి. జిల్లాకు చెందిన ఒక మంత్రి సైతం చర్యలు లేకుండా చూడాలంటూ పోలీసులకు సిఫార్సు చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను ఆయన తన సన్నిహితుడికి అప్పగించినట్టు భోగట్టా. అయితే, పోలీసులు మాత్రం ఒత్తిళ్లను, సిఫార్సులను పట్టించుకోకుండా దర్యాప్తులో వేగం పెంచారు.

మరిన్ని వార్తలు