లారీడ్రైవర్ కావాలన్న ఆకాంక్షే ఐపీఎస్‌ను చేసింది

16 Nov, 2015 08:46 IST|Sakshi
లారీడ్రైవర్ కావాలన్న ఆకాంక్షే ఐపీఎస్‌ను చేసింది

సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్
దసరా, దీపావళి మన పండగలు కావు.. మనం నరకాసురుడి వారసులం
2050 నాటికి మాదిగలు రాజులుగా మారాలి
మార్చి 15 నుంచి భీమ్ దీక్ష చేస్తాం..
 
 హైదరాబాద్: లారీ డ్రైవర్ కావాలన్న ఆకాంక్షే తనను ఐపీఎస్ అధికారిని చేసిందని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఆదివారం తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిరంలో తెలంగాణ మాదిగ సంఘం ఆధ్వర్యంలో దసరా-దీపావళి పండగలను పురస్కరించుకుని సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్‌ను సత్కరించారు. సత్కారం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘మారుమూల ప్రాంతంలో పుట్టాను. దారిద్య్రంలో పెరిగాను. బానిస బతుకులను వెళ్లదీసే సమయంలో నా తల్లి నన్ను చదివించింది.

చదివే సమయంలో నా తల్లి పెద్దయ్యాక ఏమవుతావని ప్రశ్నించింది. వెంటనే లారీ డ్రైవర్‌ను అవుతానని చెప్పారు. సమాధానమిచ్చానో లేదో నా చెంప చెళ్లుమంది. లారీ డ్రైవర్ అయ్యేందుకేనా చదివించేది అంటూ ఇంటి నుంచి బయటకు తోసేసింది. అప్పటి నుంచి కసితో సాంఘీక గురుకుల విద్యాలయాల్లో ఉంటూ విద్యను అభ్యసించాను. నా తల్లి ఆశించిన ఐపీఎస్‌ను సాధించాను. ఇదంతా డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ పెట్టిన భిక్ష. దొర దగ్గర బానిస బతుకు వెళ్లదీస్తున్న కుటుంబం నుంచి వచ్చిన నాకు ప్రజలకు సేవ చేసే అధికారం వచ్చిందంటే అందుకు కారణం రిజర్వేషన్లే. అవి లేకుంటే నేను ఈ స్థాయిలో ఉండే వాడిని కాదు.

వసతి గృహాల్లో ఉండి చదువుకోకుంటే ఐపీఎస్ అయ్యేవాడినే కాదు. అందుకే విద్యార్థులందరూ వసతి గృహాల్లో చేరండి. హాస్టల్స్‌లో చేరిన ప్రతి ఒక్కరూ నాలా కాకుంటే నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తాను’’ అని చెప్పారు. రాబోయే మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు భీమ్ దీక్ష చేపట్టనున్నట్లు ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. ఇది అయ్యప్ప దీక్షలాగా ఉండదని, ప్రతి ఒక్కరూ ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి మహనీయుల చరిత్రను చదివి పిల్లలకు ప్రబోధిస్తారని, అలాగే నెల రోజుల పాటు మాంసాహారం స్వీకరించరని, దీక్షలో ఉన్న వారందరూ పొగ, మందు సేవించరని స్పష్టం చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన మక్కాకు ముస్లింలు ఎలా యాత్రను చేపడతారో అలాగే మనందరం ఉత్తరప్రదేశ్‌లో మాయావతి నిర్మించిన సామాజిక పరివర్తన స్థలాన్ని సందర్శించాలని కోరారు.

మార్చి 15న కాన్షీరామ్ జయంతి, ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 11న జ్యోతి రావు పూలే జయంతి, ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి క్రమంగా రావడంతో ఈ సమయంలో దీక్ష చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, రిటైర్డ్ ఐఆర్‌టీఎస్ నాయకులు ఎ.భరత్ భూషణ్, మాదిగ సంఘం నాయకులు టి.వి.నారాయణ, బోయిన ఎల్లేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
 
 బతుకమ్మ మన సంస్కృతి కాదు

 తిండి పెట్టిన వాడే(అంబేడ్కర్) మన దేవుడని, వారినే మనం నిరంతరం స్మరించుకోవాలి, పూజించాలి కానీ బతుకమ్మలను కాదని ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. మనతో బతుకమ్మ ఆడించిన వారు బంగళాల్లో ఉంటారని, మనం మాత్రం బానిసలుగానే ఉంటామని చెప్పారు. బతుకమ్మ మన సంస్కృతి కాదని, దసరా, దీపావళి మన పండగలు కావని, మనమంతా నరకాసురుడి వారసులమని చెప్పారు. నరకాసురుడిని చంపి మనతోనే దసరా, దీపావళి పండగలను చేయిస్తున్నారని దుయ్యబట్టారు. క్రీ.పూ 2500 కాలంలో దళితులందరూ రాజులుగా ఉండేవారని, ఆ వారసత్వాన్ని మళ్లీ పొందాలని, రాజులు కావాలనుకునే వారు బానిసలుగా ఉండకూడదని చెప్పారు. 2050 సంవత్సరానికి మాదిగలకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా యువకులంతా పనిచేయాలని సూచించారు. రాజ్యాధికారం దక్కించుకోవాలంటే ఎవరి ముందూ చేతులు కట్టుకుని నిలబడరాదని, ఒంగి నడవాల్సిన పనిలేదని, ఏ ప్రభుత్వాధికారినైనా కలిసే సమయంలో కాళ్లకు చెప్పులు విడవకుండా ఉండాలని హితువు పలికారు.

మరిన్ని వార్తలు