బ్యాంకు లాకర్లు భద్రమేనా? | Sakshi
Sakshi News home page

బ్యాంకు లాకర్లు భద్రమేనా?

Published Mon, Nov 16 2015 8:06 AM

బ్యాంకు లాకర్లు భద్రమేనా?

ఫైనాన్షియల్ బేసిక్స్
మీరు ఇంటికి సంబంధించిన విలువైన పత్రాలు, బంగారు ఆభరణాలు, ఇతర బాండ్లను బ్యాంకు లాకర్లలో దాచాలని నిర్ణయించుకున్నారా? అయితే కింది ఉదాహరణ ఒకసారి చూడండి.
 
రవి చేసేది ప్రైవేట్ ఉద్యోగం. తను గతంలో దాదాపు రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను, ఇతర బాండ్లను, వస్తువులను ఒక బ్యాంకు లాకర్‌లో ఉంచాడు. 

ఒక రోజు ఉదయం అతనికి బ్యాంకు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. విషయం ఏంటంటే.. అతని లాకర్‌లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోయాయి. రవి ఆదరాబాదరాగా బ్యాంకుకు వెళ్లాడు. ఎలా జరిగిందని బ్యాంకును అడిగితే తెలియలేదని సమాధానం. పైగా రవి లాకర్ ను సరిగా లాక్ చేయలేదని, అందువల్లే దొంగతనం జరిగి ఉండొచ్చని బ్యాంకు చెప్పింది. దీంతో రవి బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ దగ్గరకు వెళ్లాడు. కస్టమర్ లాకర్‌ను సరిగా లాక్ చేసి వెళ్లాడా? లేదా? అనే విషయాన్నే సరిగా తెలుసుకోలేకపోయిందని, అది బ్యాంక్ తప్పేనని తేల్చింది. అలాగే రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది.

అక్కడ తీర్పు రవికి అనుకూలంగానే వచ్చినా.. దొంగతనం జరిగిన డబ్బులో కొంత మొత్తం మాత్రమే అతనికి తిరిగొచ్చింది. బ్యాంకు కర్తవ్య నిర్వహణ లోపం వల్ల రవి రూ.10 లక్షలు కోల్పోయాడు.
 
ఈ ఘటన నుంచి మనం ఏం నేర్చుకోవాలి?
మీరు భవిష్యత్తులో లాకర్లను ఉపయోగించేటప్పుడు వాటిని సరిగా లాక్ చేశారో లేదో ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. బ్యాంకు నుంచి తిరిగి వచ్చేటప్పుడు లాకర్ సరిగా లాక్ చేసి ఉందా? లేదా? అని సంబంధిత అధికారులను ఒకసారి చూడమని అడగండి. దీనికి బ్యాంకు అధికారులు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. కానీ అడగడం వల్ల మనకు పోయేదేమీ లేదు కదా.
 
ఈ విషయాన్ని గుర్తుంచుకోండి..
దొంగతనం కాకుండా బ్యాంకు లాకర్లలో అగ్నిప్రమాదం సంభవిస్తే.. లాకర్‌లోని వస్తువులకు డ్యామేజ్ జరిగితే.. అప్పుడు పరిస్థితేంటి? బ్యాంకు మీ సొమ్ముకు ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఎందుకంటే మీరు లాకర్‌లో ఏ వస్తువులు ఉంచారో బ్యాంకు తెలుసుకోదు. అంటే మీ వస్తువులకు బ్యాంకు హామీ ఇవ్వదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement