అంబరాన్నింటిన సంబరం

14 Oct, 2016 22:25 IST|Sakshi
అంబరాన్నింటిన సంబరం
- దేవగరట్టులో ఉత్కంఠగా సాగిన గొలుసు తెంపు కార్యక్రమం
- గొరువయ్యల ఢమురుక శబ్దంతో హోరెత్తిన క్షేత్రం
- ఆకట్టుకున్న దేవదాసీల క్రీడోత్సవం
- భారీగా తరలివచ్చిన భక్తులు
- నేటితో ముగియనున్న ఉత్సవాలు
  
హొళగుంద/ఆలూరు రూరల్‌: దేవరగట్టు దసరా ఉత్సవాల సంబరం అంబరాన్నింటింది. ఉత్సవంలో భాగంగా శుక్రవారం గొరువయ్యల నృత్యాలు, దేవదాసీల క్రీడోత్సవాలను చూసేందుకు తరలివచ్చిన భక్తులతో క్షేత్రం పరిసరాలు కిటకిటలాడాయి. హాలహర్వి మండలం బల్లూరుకు చెందిన గొరువయ్య గాదిలింగప్ప ఒకే దెబ్బకు ఇనుప గొలుసును తెంపేసాడు. దాదాపు 20 కేజీలు గొలుసును ఒకే దెబ్బకు తెంపండంతో భక్తులు గొరువయ్యను అభినందించారు. అంతకు ముందు గొరువయ్యలు చేసిన ఢమురుకల శబ్దంతో దేవరగట్టు హోరెతింది. సింహాసన కట్టమీద అదిష్టించిన శ్రీమాళమల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాల ఎదుట ఈ కార్యక్రమాలు కొనసాగాయి. క్షేత్ర పరిసరాల గ్రామాల నుంచే కాకుండా, కర్ణాటక రాష్ట్రం నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చిన గొరవయ్యలు తమ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. పిల్లనిగ్రోవి ఊదుతూ, త్రిశూలం చేతబట్టి, ఢమురకులను ఆడిస్తూ లయబద్దంగా నృత్యం చేశారు. సాయంత్రం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దేవదాసిల క్రీడోత్సవం, వసంతోత్సవం, కంకణ విసర్జన కార్యక్రమాలతో విగ్రహాల ఊరేగింపుతో కొండ పైనున్న ఆలయానికి చేరుకున్నాయి. శనివారం సాయంత్రం విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవంలో ఎఽలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆలూరు సీఐ శంకరయ్య, ఎస్‌ఐలు మారుతి, మస్తాన్‌వలి, వెంకటరమణ, కృష్ణమూర్తి బందోబస్తు నిర్వహించారు.     
 
మరిన్ని వార్తలు