సర్వేలో చేతివాటం

17 Jun, 2017 01:45 IST|Sakshi
కుక్కునూరు : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం వల్ల ముంపుబారిన పడే కుక్కునూరు మండలంలో సర్వేయర్ల చేతివాటం వెలుగు చూసూ్తనే ఉంది. భూ సేకరణలో చోటుచేసుకున్న అక్రమాలపై ఆ విభాగం అధికారి గతంలో అవార్డు విచారణ చేపట్టి అవకతవకలను సరిచేశారు. ఇకపై ఇలాంటి తప్పులు చోటుచేసుకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అయినా సర్వేయర్లలో ఏ మాత్రం మార్పురాలేదని మండలంలోని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. తాజాగా వింజరం పంచాయతీలో 
అసైన్‌మెంట్‌ భూముల గుర్తింపునకు సర్వే చేపట్టగా.. సర్వేయర్లు అవినీతికి పాల్పడి పేదల భూములను పెద్దలకు కట్టబెట్టారని బాధితులు చెబుతున్నారు. 
 
ఉదాహరణలివిగో..
వింజరం గ్రామంలో సర్వే నంబర్‌ 131లో ఒక వ్యక్తికి  2 ఎకరాల 16 కుంటల భూమి ఉండగా.. సర్వేయర్లు 4 ఎకరాల 16 కుంటల భూమి ఉన్నట్టు నమోదు చేశారు. ఆ భూములు అతని వారసులకు చెందుతాయని పేర్కొన్నారు. ఈ సర్వే నంబర్‌కు సంబంధించి పంచాయతీలో ప్రదర్శించిన నోటిఫికేషన్‌, ఆన్‌లైన్‌ పహాణీలో తేడా ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. స్థానిక నాయకుడితో వాటాలు మాట్లాడుకున్న సర్వేయర్లు అతడికి సంబంధం లేని భూమిని కూడా అతడి పేరుమీద రాశారనే ఆరోపణలు ఉన్నాయి.  
 
న్యాయం చేయాలి
వింజరంలో సర్వే నంబర్‌ 131లో మా నాన్న పేరు మీద 2 ఎకరాల భూమి ఉంది. మరో ఎకరాన్ని పోడు చేసుకుని సాగు చేసుకుంటున్నాను. సర్వేయర్లు వచ్చిన సమయంలో స్థానికంగా ఉండే ఒక వ్యక్తి.. మొత్తం ఐదెకరాలు నా పేరిట రాయిస్తానన్నాడు. చివరకు అరెకరం రాయించి మిగిలిన భూమిని తనపేరిట రాయించుకున్నాడు. 
– కొత్తా మనోహరం, వింజరం, కుక్కునూరు
 
స్థానిక నేత బెదిరించాడు
వింజరంలో సర్వే నంబర్‌ 68లో ఎకరం వరి కుంటను మా కుటుంబ సభ్యులు ఎప్పుడో కొన్నారు. దానికి చుట్టూ నాలుగెకరాల పోడును సాగు చేసుకుంటున్నాం. భూమి అమ్మిన వ్యక్తి వచ్చి ఐదెకరాల్లో తనకు వాటా ఉందన్నాడు. మాకు అమ్మింది ఎకరమే కదా అంటే.. బెదిరించాడు. నోటిఫికేషన్‌లో మాకు చెందిన 2 ఎకరాల భూమి అతని పేరు మీద వచ్చింది.        
 –దాసరి ఇమ్మానుయేలు, వింజరం
 
మరిన్ని వార్తలు