మళ్లీ రెచ్చిపోయిన చింతమనేని

24 Feb, 2016 02:09 IST|Sakshi
మళ్లీ రెచ్చిపోయిన చింతమనేని

ఈసారి ఇరిగేషన్ అధికారిపై దాడి  కాలర్ పట్టుకొని ఈడ్చివేసిన వైనం

 సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రభుత్వ ఉద్యోగులపై తరచూ దాడులకు పాల్పడే ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మంగళవారం మరోసారి రెచ్చిపోయారు. ఆయన తాజాగా నీటిపారుదలశాఖ అధికారి, సిబ్బందిపై దాడి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పరిసరాల్లోని కృష్ణా డెల్టాలో 58 వేల ఎకరాల సాగు కోసం ఇరిగేషన్ అధికారులు గోదావరి జలాలను మోటార్ల ద్వారా గతేడాది డిసెంబర్ వరకు తోడారు. గోదావరి కాల్వలో నీటి నిల్వలు ఇంకిపోవడంతో రెండు నిలల క్రితం తోడకాన్ని నిలిపివేశారు. ఈ నేపథ్యంలో అక్కడ విద్యుత్ మోటార్లు, వైర్లు నిరుపయోగంగా మారాయి. ఆ వైర్లను, మోటార్లను అక్కడి నుంచి తొలగించి తీసుకువెళ్లేందుకు చింతమనేని తన అనుచరులతో కలిసి జేసీబీని తీసుకుని మంగళవారం సాయంత్రం తూర్పు లాకుల వద్దకు చేరుకున్నారు.

విద్యుత్ వైర్లను జేసీబీతో తొలగిస్తుండగా భూమిలో పాతిన వైరు కొంత దెబ్బతింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన చింతమనేని ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే వైర్లు, మోటార్లు పాడైపోయాయంటూ అక్కడే ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్ హుస్సేన్ కాలర్ పట్టుకుని ఈడ్చివేశారు. అడ్డొచ్చిన ఆఫీస్ అసిస్టెంట్ గణేష్‌పై కూడా దౌర్జన్యం చేశారు. దీంతో హడలెత్తిపోయిన ఇరిగేషన్ అధికారులు జరిగిన దాడి ఘటన గురించి మాట్లాడేందుకు  నిరాకరిస్తున్నారు. జేసీబీతో పని చేయించడం వల్లనే వైర్లు దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు. చింతమనేని దాడి గురించి హుస్సేన్‌తో ‘సాక్షి’ ప్రతినిధి ప్రశ్నించగా... జరిగిందేదో జరిగింది వదలేయండని ఆయన సమాధానమిచ్చారు. దాడి జరిగిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాను అని చెప్పారు.
 

మరిన్ని వార్తలు