ఎర్ర బంగారులోకం..

12 Mar, 2016 03:15 IST|Sakshi
ఎర్ర బంగారులోకం..

మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి
శుక్రవారం 80వేల బస్తాలు రాక
నిండిన యార్డులు, రహదారులు
వరుస సెలవులే కారణం

ఖమ్మం వ్యవసాయం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎరుపెక్కింది. వరుస సెలవుల తర్వాత తెరుచుకున్న మార్కెట్ శుక్రవారం ఎర్రబంగారంతో నిండిపోయింది. దాదాపు 80వేల మిర్చి బస్తాలను రైతులు మార్కెట్‌కు తరలించడంతో కళకళలాడింది. కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మార్కెట్ యార్డును ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. ఎన్నికల స్ట్రాంగ్ రూమ్‌లు, డిస్ట్రిబ్యూషన్ పాయింట్, కౌంటింగ్ తదితర ప్రక్రియను యార్డులోనే నిర్వహించారు. శని, ఆదివారం సెలవులు, అమావాస్య కావడంతో ఈనెల 4 నుంచి 9వ తేదీ వరకు వ్యవసాయ మార్కెట్‌లో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు పూర్తిగా నిలిపివేశారు. దీంతో గురు, శుక్రవారా ల్లో మిర్చి భారీగా అమ్మకానికి వచ్చింది. 12, 13 తేదీలు కూడా సెలవు దినాలు కావటంతో శుక్రవారం మిర్చి పోటెత్తింది. గురువారం కూడా దాదాపు 80 వేల బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చింది.

యార్డుల్లో సరుకు కొనుగోళ్లు, కాంటా లు పూర్తయినా వ్యాపారులు సరుకును కేంద్రాలకు తరలించలేకపోయారు. వాహనాల్లో లోడ్ చేయటం.. వాటిని తరలించటానికి సమయం పడుతోంది. శుక్రవారం కూడా 80వేల బస్తాల మిర్చి అమ్మకానికి రావటంతో యార్డులు, రహదారులపై రైతులు సరుకును దించక తప్పలేదు. మిర్చి, అపరాల యార్డు రహదారుల్లో బస్తాలను దించుకున్నారు. దీంతో శుక్రవారం మార్కెట్ కార్యాలయానికి దారికూడా మూసుకుపోయింది.

ఓ వైపు ఎండ.. మరో వైపు ఘాటు ఉండటం తో కార్మికులు పంట ఉత్పత్తిని కాంటా పెట్టడానికి.. సరుకును వాహనాల్లో ఎత్తటానికి ఇబ్బంది పడ్డారు. మిర్చి గరిష్టధర రూ.12,300 పలికింది. ధర కూడా కొంత మేర ఆశాజనకంగా ఉండటంతో జిల్లా రైతులేకాక నల్లగొండ, వరంగల్, ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన రైతులు సరుకును ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేయకుండా నేరుగా మార్కెట్‌లో అమ్ముతున్నారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావటంతో యార్డులు, రహదారుల్లో ఉన్న సరుకునంతా బయటకు పంపించి.. సోమవారానికి యార్డులను సిద్ధం చేస్తామని మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పాలకుర్తి ప్రసాదరావు ‘సాక్షి’తో చెప్పారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా