షీప్‌ ఫెడరేషన్‌ నేతల మధ్య రగడ

11 Aug, 2017 21:46 IST|Sakshi
షీప్‌ ఫెడరేషన్‌ నేతల మధ్య రగడ

– జేడీ అనారోగ్యంతో ప్రత్యేక సమావేశం నేటికి వాయిదా
అనంతపురం అగ్రికల్చర్‌: గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘాల జిల్లా సమాఖ్య (షీప్‌ ఫెడరేషన్‌) పాలక వర్గం, సొసైటీ సభ్యుల మధ్య రగడ జరిగింది. రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర దూషణలు, వాదులాటకు దిగారు. ఒక దశలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. చివర్లో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది. వివరాల్లోకి వెళితే... షీప్‌ ఫెడరేషన్‌ పాలక వర్గంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో... రిజిష్ట్రార్‌ హోదాలో పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్‌ బి.సన్యాసిరావు శుక్రవారం ‘అవిశ్వాస తీర్మానం’పై ప్రత్యేక పాలక వర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం ఇవ్వడంతో పాలకవర్గం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, డైరెక్టర్లతో పాటు జిల్లా వ్యాప్తంగా పలువురు సొసైటీ అధ్యక్షులు, సభ్యులు కూడా శుక్రవారం జేడీ కార్యాలయానికి తరలివచ్చారు.

అయితే అనారోగ్యం కారణంగా జేడీ అందుబాటులో లేనందున ప్రత్యేక సమావేశం శనివారానికి వాయిదా వేస్తూ ఉన్నఫలంగా అధికారులు నోటీసులు అతికించారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు అక్కడే మకాం వేయడం, జిల్లా వ్యాప్తంగా వచ్చిన సభ్యులు, వారి మద్ధతుదారులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాయిదా పడేందుకు ‘మీరంటే మీరు’ కారణమంటూ రెండు వర్గాలుగా విడిపోయి వాదులాటకు దిగారు. ఫెడరేషన్‌ నేతల మధ్య నెలకొన్న వివాదం కారణంగా ప్రభుత్వం నుంచి అందే ప్రయోజనం, ఎన్‌సీడీసీ రుణాలు అందకుండా పోతున్నాయని, గ్రామాల్లో గొర్రెల కాపర్లు ఇబ్బంది పడుతున్నందున అందరూ రాజీనామా చేయాలని పలువురు సొసైటీ అధ్యక్షులు డిమాండ్‌ చేశారు.

రండి అందరూ రాజీనామా చేస్తామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఫెడరేషన్‌లో ఉన్నవారిలో చాలా మందికి గొర్రెలు కూడా లేవని, కాపర్ల కష్టాలు, ఇబ్బందులు వారికేం తెలుసని పలువురు దుమ్మెత్తిపోశారు. రుణాలు మంజూరయ్యే సమయంలో ఇలా కొట్లాడుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఫెడరేషన్‌ వ్యవహారం, నిర్వహణలో అధికారులు కూడా విఫలమవుతున్నారని మండిపడ్డారు.  సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసేలోగానే చాలా మంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో శనివారం అయినా ప్రత్యేక సమావేశం సజావుగా జరుగుతుందా.. లేదా అనేది ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని వార్తలు