కేంద్రియ విద్యాలయంలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి

27 Jul, 2016 23:34 IST|Sakshi
  •  లోక్‌సభలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • ఖమ్మం:  ఖమ్మం కేంద్రియ విద్యాలయంలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ఆయన లేవనెత్తారు. ఖమ్మంలో  2007లో కేంద్రియ విద్యాలయం స్థాపించారని, అప్పటి నుంచి ఆ పాఠశాల సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని అన్నారు. విద్యాలయంలో మొత్తం 45 మంది రెగ్యులర్‌ పోస్టులు ఉండగా గతేడాది వరకు 15 మంది ఉపాధ్యాయులే పనిచేశారని తెలిపారు. గతేడాది జరిగిన సాధారణ బదిలీల్లో పది మంది ఇతర ప్రాంతాలకు వెళ్లారని, ప్రస్తుతం ఐదుగురు మాత్రమే అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారని వివరించారు. విద్యలో నాణ్యత లోపించి విద్యార్థులు వెనుకబడిపోతున్నారని పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలను సరఫరా చేయడంలేదన్నారు. స్కూల్‌ నిధుల నుంచి డబ్బులు ఖర్చు చేసి వాటిని కొనుగోలు చేయడం వల్ల కేంద్రియ విద్యాలయం నడవడం కష్టంగా మారుతోందని వివరించారు. ఇకనైనా కేంద్రం స్పందించి ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతోపాటు విద్యాహక్కు చట్టం మేరకు యూనిఫాం, పుస్తకాల ఖర్చు, రవాణాకు నిధులు మంజూరుచేయాలని కోరారు. అంతకు ముందు ఎంపీ ఇదే అంశంపై మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్‌ జవడేకర్‌కు వినతిపత్రం సమర్పించారు.

మరిన్ని వార్తలు