అమ్మ గాబరా.. నాన్న హైరానా.. పిల్లల హంగామా..

13 Jun, 2017 00:05 IST|Sakshi
అమ్మ గాబరా.. నాన్న హైరానా.. పిల్లల హంగామా..
పాఠశాలలు పునఃప్రారంభం
- ఎప్పటిలానే స్వాగతం పలికిన సమస్యలు
- స్వీపర్లుగా మారిన విద్యార్థులు
- యూనిఫాం ఊసే కరువు
- పూర్తిస్థాయిలో అందని పాఠ్య పుస్తకాలు
- విద్యార్థుల హాజరు అంతంతే..
 
పిల్లలతో పాటు బారెడు పొద్దెక్కే వరకు నిద్రించే తల్లులు అలారం పెట్టుకుని మరీ నిద్ర లేస్తున్నారు. ముసుగుతన్ని పడుకున్న చిన్నారులను బలవంతంగా నిద్రలేపి పాఠశాల వేళకు సిద్ధం చేయడం కత్తి మీద సాముగా మారింది. ఇంటి నుంచి అడుగు బయట పడగానే.. తండ్రి బాధ్యత మొదలయింది. ప్రార్థన సమయానికి పిల్లలను పాఠశాలకు చేర్చాలనే ఆత్రుత కనిపించింది. ఇక పాఠశాలల వద్ద ఒకటే సందడి. అప్పుడే పాఠశాలకు వచ్చే చిన్నారుల ముఖాల్లో ఒకింత సంతోషం కనిపించినా.. చాలా మంది పిల్లల అడుగులు అయిష్టంగానే ముందుకు పడ్డాయి. తల్లిదండ్రుల ఉరుకులు పరుగులు.. ‘బుడి’ బడి అడుగుల మధ్య కొత్త విద్యా సంవత్సరం సోమవారం నుంచి ఆరంభమైంది.
 
కర్నూలు సిటీ: వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. బడి గంట మోగడంతో సందడి మొదలయింది. ఎప్పటిలానే ఈ ఏడాదయినా సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయని ఆశించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఉదయం 7.30 గంటల నుంచే ఇళ్లలో హడావుడి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఆ సంతోషం స్పష్టంగా కనిపించింది. ప్రయివేట్‌ పాఠశాలల వద్ద కూడా సందడి కనిపించినా.. కొందరు పిల్లలు మొండికేయడం, తల్లిదండ్రులు చిరుతిండ్లతో గారాభం చేసిన తీరు చుట్టుపక్క వారి ముఖాల్లో నవ్వులు పూయించింది. మొత్తంగా పాఠశాలల వద్ద జాతర వాతావరణం కనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు పాఠశాలలకు చేరుకునేందుకు ఆటోలు, బస్సులు, మోటార్‌ సైకిళ్లను ఆశ్రయించారు. ఇకపోతే గత ఏడాది కంటే ఈ విడత 15 శాతం పెంచిన ఫీజుల మోత తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసింది. 
 
ప్రభుత్వ స్కూళ్లలో స్వీపర్లుగా విద్యార్థులు
నెలన్నరకు పైగా వేసవి సెలవుల వల్ల మూత పడ్డ ప్రభుత్వ స్కూళ్లలో గదులన్నీ దుమ్ము, ధూళితో నిండిపోయాయి. అయితే వీటిని శుభ్రం చేసేందుకు ప్రభుత్వ స్కూళ్లకు స్వీపర్లు లేకపోవడంతో విద్యార్థులే గదులను శుభ్రం చేసుకోవడం కనిపించింది. వాస్తవానికి ఆయా స్కూళ్లలో టాయిలెట్లు శుభ్రం చేసే వారితో ఈ పని చేయించాల్సి ఉన్నా.. ఆ పరిస్థితి కరువైంది. అయితే వారిని ఈ విద్యా సంవత్సరంలో కొనసాగిస్తారో, తొలగించారో తెలియని దుస్థితి నెలకొంది. దీంతో పాఠశాలలకు వచ్చిన విద్యార్థులతోనే ఉపాధ్యాయులు శుభ్రం చేయించారు. మొదటి రోజే చిన్నారులతో చీపురులు పట్టించడంపై కొన్ని చోట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తే.. పరిసరాల పరిశుభ్రత అంటూ సర్దిచెప్పడం గమనార్హం.
 
సరదాలతోనే గడిచిన మొదటి రోజు
పాఠశాలలు పునఃప్రారంభమైన రోజున వేసవి సెలవుల్లో ఎవరెవరు ఎక్కడ విహరించారు.. ఏమి చేశారనే దానిపై విద్యార్థులతో ఉపాధ్యాయులు ఆనందాలను పంచుకుని సరదాగా గడిపారు. మరికొంత మంది అయితే గత తరగతి నుంచి పైతరగతి వచ్చిన సందర్భంలో ఎలా చదవాలి అనే అంశంపై విద్యార్థులకు టీచర్లు తెలియజేశారు. మొదటి రోజున కచ్చితంగా ప్రతి టీచర్‌ స్కూల్‌కు హాజరుకావాలనే ప్రభుత్వ ఆదేశాలను అందరూ పాటించారు.
 
బయోమెట్రిక్‌ హాజరు అంతంతే..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్‌ పరికరాలు మొదటి రోజునే మొరాయించాయి. జిల్లాలో మొత్తం 33 ఏపీ ఆదర్శ స్కూళ్లు, 335 జెడ్పీ పాఠశాలలు, 25 రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో బయెమెట్రిక్‌ పరికరాలను పంపిణీ చేయగా.. ఇందులో 350 స్కూళ్లలో మాత్రమే కరెంట్‌ సరఫరా ఉండడంతో ఏర్పాటు చేశారు. మొదటి రోజున ఉదయం 36.44 శాతం మంది టీచర్లు ఈ–హాజరు వేశారు. స్కూల్‌ ముగిసే సమయంలో 21.66 శాతం ఈ–హాజరు నమెదయింది. విద్యార్థుల ఈ–హాజరు 0.38 శాతం మాత్రమే నమోదు కావడం చూస్తే బయెమెట్రిక్‌ పని తీరు ఇట్టే అర్థమవుతుంది.
 
పుస్తకాలు, యూనిఫాం ఏది?
ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్న విద్యార్థులకు స్కూళ్లు పునఃప్రారంభమయ్యే నాటికి పాఠ్యపుస్తకాలు, యూనిఫాం మొదటి రోజునే అందజేస్తామని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు హామీ ఇచ్చారు. కానీ జిల్లాలో ఒక్క స్కూల్‌కు కూడా పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందకపోవడం గమనార్హం. జిల్లాలోని 4,282 స్కూళ్లకు చెందిన 6.41 లక్షల విద్యార్థులకు 18.23 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా.. 45 శాతం మాత్రమే జిల్లాకు చేరాయి. వీటిలో 73 శాతం పాఠ్యపుస్తకాలు ఆయా మండలాలకు చేర్చారు. యూనిఫాంకు ఇంత వరకు పైసా బడ్జెట్‌ కూడా రాలేదు. దీంతో విద్యార్థులు పాత దుస్తులు, పాత పుస్తకాలతోనే స్కూళ్లకు హాజరయ్యారు.
 
మరిన్ని వార్తలు