జీ హుజూర్

5 Jul, 2016 03:47 IST|Sakshi
జీ హుజూర్

ఫైవ్‌మెన్ కమిటీకి తలొగ్గుతున్న ఓఎంసీ అధికారులు
స్థానిక ఎమ్మెల్యే పేరుతో అక్రమాలు
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు వారు చెప్పిన వారికే
కాంట్రాక్టు పనులు కమిటీ కనుసన్నల్లోనే
అభివృద్ధిని పరిశీలించేందుకే కమిటీలంటూ మసిపూస్తున్న ఎమ్మెల్యే

 ఒంగోలు అర్బన్ : నగరపాలక సంస్థలో స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నియమించిన ఫైవ్‌మెన్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే అండదండలతో, అధికార బలంతో నగరపాలక అధికారులకు తలనొప్పిగా మారారు. వారి ఆగడాలను ఏమీచేయలేక ఓఎంసీ సిబ్బంది జీ హుజూర్ అనక తప్పడం లేదు. కమిటీ సభ్యులు హుకుం జారీ చేస్తే నగరపాలక సంస్థలో ఎటువంటి పనైనా జరిగిపోవాల్సిందే. ఆక్రమణలైనా, అక్రమ పనులైనా, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలైనా, భవన నిర్మాణ అనుమతులైనా, కాంట్రాక్టు పనులైనా ఏదైనా సరే ఫైవ్‌మెన్ కమిటీ కనుసన్నల్లో జరగాల్సిందే.

వారి మాట కాదని కమిషనర్, మున్సిపల్ ఇంజినీర్ దగ్గర నుంచి అటెండర్ల వరకు ఏ పనీ చేయడానికి వీల్లేదు. దీన్నిబట్టి నగరపాలక సంస్థలో ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన ఫైవ్‌మెన్ కమిటీ సభ్యులు అనధికారిక ఉన్నతాధికారుల్లా వ్యవహరిస్తున్నారు. ఏవైనా సమావేశాలు, సభలు జరిగినపుడు ఎమ్మెల్యే మాత్రం కేవలం నగరంలో జరిగే అభివృద్ధి పనులు పరిశీలించేందుకే కమిటీ ఏర్పాటు చేశానని, అధికారులను ఇబ్బందికి గురిచేస్తే సహించేది లేదని పలుమార్లు వ్యాఖ్యానించారు. అయినా తమ్ముళ్ల ఆగడాలు ఆగకపోవడంతో ఎమ్మెల్యే బహిరంగంగా ఒక మాట చెప్తూ అంతర్గతంగా వారికి మద్దతు తెలుపుతున్నాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరపాలక సంస్థలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల్లో కమిటీ సభ్యులు సూచించిన వారే ఎక్కువ మంది ఉన్నారు.

వీరి ద్వారా నగరపాలకంలో జరిగే ప్రతి విషయం వారికి చే రవేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకొని కమిటీ సభ్యులు చక్రం తిప్పుతున్నారు.  మున్సిపల్ ఇంజినీర్ చాంబర్‌లో అయినా, కమిషనర్ దగ్గరైనా ఫైవ్‌మెన్ కమిటీ సభ్యులు నిత్యం కలిసి మంతనాలు చేయాల్సిందే. చివరికి డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (డీఎంఏ) వచ్చిన సందర్భంలోనూ  ఈ కమిటీ సభ్యులు ఆయన్ని కలిసి వారికి అవసరమైన పనులు చేయాల్సిందిగా కోరతారు. దీన్నిబట్టి చూస్తే ఎమ్మెల్యే అండదండలు లేకుండా కమిటీ సభ్యులు నగరపాలక సంస్థలో ఇంతలా అధికారం చెలాయిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. వీరు ఓఎంసీ కార్యాలయానికి వచ్చారంటే అధికారుల వద్ద ఎవరు ఉన్నా వారిని బయటకు పంపి గంటలకొద్దీ చాంబర్లలో కూర్చొని మంతనాలు జరుపుతారు. దీంతో సమస్యలపై వచ్చే ప్రజలు అధికారులను కలవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే దామచర్ల ఫైవ్‌మెన్ కమిటి ఆగడాల నుంచి నగరపాలక సిబ్బందిని, నగర ప్రజలను కాపాడాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు