కన్నపేగుకు ఖరీదు..?

3 Apr, 2016 02:34 IST|Sakshi
కన్నపేగుకు ఖరీదు..?

పసికందు రూ. 2 లక్షలకు విక్రయం..
ఎట్టకేలకు శిశువిహార్‌కు తరలించిన అధికారులు

మంచాల: పోషణ భారమనుకున్నారో.. లేక ఆడపిల్ల అనుకున్నారో ఏమో ఆ తల్లిదండ్రులు తమ కన్నపేగుకు ఖరీదు కట్టి విక్రయించారు. ఎట్టకేలకు ఐసీడీఎస్ అధికారులు శిశువును శిశు విహార్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బండలేమూర్‌లో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  బండలేమూర్‌కు చెందిన పద్మకు ఆరేళ్ల క్రితం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం చింతపల్లి పరిధిలోని బండకింది తండాకు చెందిన రాజుతో వివాహం జరిగింది.  వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఈక్రమంలో గత జనవరి 1న పద్మ తిరిగి ఆడపిల్లను ప్రసవించింది. పాప పుట్టిన నాలుగు రోజులకే రూ. 2 లక్షలకు ఘట్‌కేసర్ మండలం అన్నోజీగూడకు చెందిన వెంకన్నకు విక్రయించారు.

అయితే, స్వగ్రామంలో ఎవరికీ అనుమానం రాకుండా పద్మ తన పుట్టిల్లు బండలేమూర్ వచ్చింది.  గతంలో కూడా పద్మ, రాజు దంపతులు తమ మూడో కూతురును అప్పట్లో రూ.70 వేలకు విక్రయించారు. అప్పట్లో ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని పాపను శిశు విహార్‌కు తరలించారు. అయితే తిరిగి పద్మ ఆడపిల్లకు జన్మనివ్వడంతో ఆమెపై ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. అయినా పద్మ తన పుట్టింటికి వచ్చి శిశువును విక్రయించింది. ఈ విషయం తెలుసుకున్న చింతపల్లి ఐసీడీఎస్ అధికారి లావణ్య, సూపర్‌వైజర్లు సత్యమ్మ, సుగుణ ఇబ్రహీంపట్నం ఐసీడీ ఎస్ అధికారుల సహకారంతో విచారణ మొదలు పెట్టగా  పుట్టిన నాలుగోరోజునే పాపను విక్రయించినట్లు తేలింది.

దీంతో పద్మ, రాజు దంపతులతోపాటు వారి కుటుంబీకులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. తాము శిశువును విక్రయించలేదని, కేవలం పెంచుకోవడానికి మాత్రమే ఇచ్చామని దంపతులు అన్నోజిగూడకు చెందిన వెంకన్న అడ్రస్ ఇచ్చారు. పోలీసుల సహకారంతో  అధికారులు ఆ పాపను తీసుకొచ్చారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు నగరంలోని శిశు విహార్‌కు తరలించారు. అయితే, తాను పాపను కొనుగోలు చేయలేదని, పెంచుకోవడానికి మాత్రమే  తీసుకున్నానని మల్లయ్య అధికారులకు తెలిపాడు.

మరిన్ని వార్తలు