రైతుల జీవితాలతో సర్కారు చెలగాటం

22 Jul, 2016 00:32 IST|Sakshi
రైతుల జీవితాలతో సర్కారు చెలగాటం
జీఓ నంబర్‌ 271ని రద్దు చేయాలి
రెతుల రౌండ్‌టేబుల్‌ సమావేశం డిమాండ్‌
భూ యాజమాన్య హక్కులకు చేటని ఆందోళన
అమలాపురం రూరల్‌ :
‘భూమి మీద యాజమాన్య హక్కులను కాలరాసే జీఓ: 271ని నిలుపుదల చేయాలి. పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్‌ డీడ్‌ల విధానం కొనసాగించి, 1బి రికార్డుల్లో తప్పులు సవరించాకే అమలు చేయాలి’ అని అఖిలపక్షాలు, రైతు సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈదరపల్లి జనహిత కార్యాలయంలో భారతీయ కిసాన్‌ సంఘ్‌ జిల్లా అధ్యక్షుడు దొంగ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం జీఓ :271పై జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో అధికార టీడీపీ, బీజేపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్,   
సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీలతోపాటు బీకేఎస్, కోనసీమ రైతు పరిరక్షణ సమితి, అఖిలభారత రైతు కూలీ సంఘం, పలు రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పట్టాదారుపాస్‌ పుస్తకాలను, టైటిల్‌ డీడ్‌ విధానాన్ని రద్దు చేసి, కొత్తగా ఇచ్చిన జీఓ :271 ప్రకారం వెబ్‌ల్యాండ్‌లో ఉంచిన 1బి ఆధారంగా మాత్రమే భూమిహక్కుల బదలాయింపు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ముక్తకంఠంతో చెప్పారు. వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో రైతుల పేర్లు, సర్వే నంబర్లు తప్పుగా ఉన్నాయని, దీని వల్ల బ్యాంకు రుణాలతోపాటు తనఖాల్లో ఇబ్బందుల పాలవుతారని అన్నారు. 
కొత్త భూ వివాదాలకు ఆస్కారం..
నీటి వినియోగదారుల సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి మాట్లాడుతూ వెబ్‌ల్యాండ్‌ ఆధారంగా రిజిస్ట్రేషను చేస్తే భూమి యజమానికి తెలియకుండా అమ్మకాలు జరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. వెబ్‌ల్యాండ్‌లో ఉన్న తప్పులను ఆధారాలతో సహా చూపించారు. బీకేఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెల్లాపు సూర్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. ఈ జీఓల వల్ల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు మాత్రమే లాభం జరుగుతుందని ఆరోపించారు. 
పార్టీలకు అతీతంగా పోరాడాలి..
వైఎస్సార్‌ సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతులు పార్టీలకు అతీతంగా ఈ సమస్యలపై పోరాడాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ఆర్‌.వి.నాయుడు మాట్లాడుతూ శాంతి యుతంగా సమావేశాలు పెట్టుకుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. పీసీసీ సభ్యుడు కల్వకొలను తాతాజీ ప్రభుత్వం స్వప్రయోజనాల కోసమే రోజుకో జీఓ తెచ్చిందన్నారు. బీకేఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమ్మి భూ రికార్డులు సర్వే చేశాకే 1బి అమలు చేయాలని డిమాండ్‌ చేశా రు. బీకేఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పుగంటి భాస్కరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి యాళ్ల వెంకటానందం, కోనసీమ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు యాళ్ల బ్రహ్మానందం, మాజీ అధ్యక్షుడు రంబాల బోసు,  రైతు సంఘం ప్రతిని ధులు అడ్డాల గోపాలకృష్ణ, తిక్కిరెడ్డి గోపాలకృష్ణ, వివిధ పార్టీలకు చెందిన పెయ్యిల శ్యామ్‌ప్రసాద్, చెల్లుబోయిన కేశవశెట్టి, చిక్కం బాలయ్య, పత్తి దత్తుడు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు