'హోం' గడవటమూ కష్టమే!

5 Dec, 2016 23:50 IST|Sakshi
'హోం' గడవటమూ కష్టమే!
పని జాస్తి.. వేతనం తక్కువ
– అమలుకు నోచుకోని ఉద్యోగ భద్రత డిమాండ్‌ 
– నేడు హోంగార్డుల 54వ వ్యవస్థాపక దినోత్సవం
 
కర్నూలు : సమాజ సేవ, శాంతిభద్రతలను పరిరక్షించడంలో హోంగార్డులు పోలీసులతో సమానంగా విధులు నిర్వహిస్తూ ప్రజల దృష్టిలో పోలీసులుగానే గుర్తింపును సొంతం చేసుకున్నారు. అగ్ని ప్రమాదాలు, వరదలు, తుఫాన్లు తదితర అత్యవసర పరిస్థితుల్లో వారి సేవలు ఎనలేనివి. మతసామరస్యాన్ని కాపాడటం, ఆర్థిక, సామాజిక, సంక్షేమ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం హోంగార్డు విధుల్లో భాగమయింది. నేర నియంత్రణతో పాటు పోలీసు అంతర్గత భద్రత, పోలీసు వాహన డ్రైవర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లతో పాటు టెక్నికల్‌ కేటగిరీల్లో హోంగార్డులు విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖ ప్రతిష్టను పెంచుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి సుమారు 16 సంస్థల్లో 350 మందికి పైగా డిప్యూటేషన్‌పై సేవలందిస్తున్నారు.
 
చాలీచాలని వేతనాలతో హోంగార్డుల జీవనం 
హోంగార్డులు రోజంతా విధులు నిర్వహించినా కుటుంబ పోషణ కష్టమవుతోంది. చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్నారు. పోలీసులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారి జీవితాల్లో మాత్రం వెలుగు కరువైంది. హోంగార్డులకు నెలకు రూ.12 వేలు మాత్రమే జీతం ఇస్తున్నారు. అనారోగ్యంతో విధులకు హాజరు కాకుంటే ఆ రోజు వేతనం ఇవ్వరు. హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కొన్నేళ్లుగా డిమాండ్‌ ఉన్నప్పటికీ అమలుకు నోచుకోని పరిస్థితి.  పోలీసు శాఖలో కానిస్టేబుళ్లతో సమానంగా 60 సంవత్సరాల సర్వీసు చేసినప్పటికీ ఎలాంటి బెనిఫిట్స్‌ లేకుండా పదవీ విరమణ పొందుతుండటంతో ఆ కుటుంబాలు వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి.
 
హోంగార్డు వ్యవస్థ 1963 డిసెంబర్‌ 6న ఏర్పాటయింది. పోలీసులకు సహాయంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. కర్నూలు జిల్లాలో 1,130 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 80 మంది మహిళలు ఉన్నారు. పోలీసు విధులే కాకుండా ట్రాఫిక్, రాత్రివేళల్లో పెట్రోలింగ్, ఆర్‌టీఓ, ఆర్టీసీ, ఐసీడీఎస్, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫైర్, జైళ్లు, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీఎస్పీ రెండవ బెటాలియన్‌ తదితర విభాగాల్లో సేవలందిస్తున్నారు.
 
పోలీసులతో సమానంగా సౌకర్యాలకు ఎస్పీ ప్రతిపాదన
పోలీసులతో సమానంగా అన్ని రకాల సౌకర్యాలను హోంగార్డులకు కల్పించాలనే సంకల్పంతో ఎస్పీ ఆకె రవికృష్ణ అనేక ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించారు. చనిపోయిన కుటుంబాలకు వెంటనే ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఏడాది 9 మందికి ఇలా ఉద్యోగం లభించింది. ఐదు జిల్లాల హోంగార్డులకు కర్నూలులోనే వర్క్‌షాప్‌ నిర్వహించి వారి కష్టసుఖాలపై ఆరా తీశారు. ప్రతి నెలా డ్యూటీ అలవెన్స్‌ అందేలా చర్యలు చేపట్టారు. బయటి డ్యూటీలకు వెళ్తే ఫీడింగ్‌ అలవెన్స్‌ ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అలాగే పిల్లలకు వివాహ రుణం, ఎడ్యుకేషనల్‌ లోన్, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ అందించాలని కోరారు. కొన్ని ఆసుపత్రుల్లో రూ.50 వేల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నారు. అలాగే ప్రధానమంత్రి ఇన్సూరెన్స్‌ పథకంలో అందరినీ సభ్యులుగా చేర్పించారు. హోం ఫర్‌ ఆల్‌ కింద కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాల్లో పనిచేసే హోంగార్డులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టారు.
ఎన్‌.చంద్రమౌళి, హోంగార్డ్స్‌ సదరన్‌ రీజియన్‌ కమాండెంట్‌
 
 
మరిన్ని వార్తలు