ఈ సీటు... యమ హాటు!

17 Apr, 2016 01:36 IST|Sakshi
ఈ సీటు... యమ హాటు!

పటాన్‌చెరు ఇన్‌స్పెక్టర్ పోస్టుకు భలే గిరాకీ
ఐదేళ్లలో ఐదుగురి బదిలీ ఓ దఫా పనిచేస్తే
స్థిరపడొచ్చన్న భావన
సగటున ఎనిమిది నెలలకో  అధికారికి స్థానచలనం
కారణం తెలియకుండానే బదిలీ
తరచూ మార్పులపై  అన్ని వర్గాల్లోనూ విస్మయం

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పోలీసు అంటేనే గుండె ధైర్యం... దానికి బుద్ధిబలం, భుజబలం తోడైతే సూపర్ పోలీస్.  కానీ పటాన్‌చెరుకు పోలీస్ బాసులుగా వచ్చిన వారు మాత్రం ఇలా వచ్చి అలా వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పోస్టింగ్ తీసుకునే వారికి అ‘ధన’పు అర్హత ఉండాలట!. ఈ సర్కిల్ బాస్ కుర్చీలోకి వచ్చేవారికి నియమ నిబంధనలు బలాదూర్. సహచర మిత్రులు కళ్లు మూసి తెరిచేలోగా    సీటు మీదికెక్కి కూర్చుంటారు. అంతే వేగంగా తెరమరుగై పోతుంటారు. గడిచిన ఐదేళ్లలో పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు వచ్చిపోవడమే ఇందుకు నిదర్శనం. బాధ్యతలు చేపట్టిన వారికి పట్టు వచ్చే సరికి తప్పిస్తున్నారు. ఫలితంగా శాంతిభద్రతలను అదుపు చేయడం   కష్టసాధ్యమవుతుందన్న వాదన కూడా ఉంది.

మూడేళ్లయినా పనిచేయాలి...
సాధారణంగా ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కనీసం మూడేళ్లయినా పనిచేయాలి. ఏవైనా ప్రత్యేక పరిస్థితుల్లో పారదర్శక కారణాలతో ఇన్‌స్పెక్టర్‌ను బదిలీ చేయవచ్చు. ఇక్కడ ఇన్‌స్పెక్టర్ పోస్టుకు ఏ ప్రత్యేక కారణాలు పనిచేస్తున్నాయో తెలియదు.. కానీ, సగటున ప్రతి ఎనిమిది నెలలకో అధికారి బదిలీ అవుతున్నారు.

 దీంతో పటాన్‌చెరు సీఐ అంటేనే పవర్ అన్న పేరొచ్చింది. జిల్లాలో మిగితా ప్రాంతాలతో పోలిస్తే పటాన్‌చెరు పోస్టుకు డిమాండ్ ఎక్కువే అని చెప్పవచ్చు. పటాన్‌చెరు అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం కావడం, రియల్ వ్యాపారం ఎక్కువగా ఉండటం, వాణిజ్య సంస్థలు, వ్యాపార కేంద్రాలకు తోడు సివిల్ వ్యవహారాలు ఎక్కువగా సీఐ పోస్టును ప్రభావితం చేస్తున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఒక్కసారైనా ఇక్కడి సీటులో కూర్చుంటే ఆర్థికంగా స్థిరపడవచ్చన్న భావన పోలీసు వర్గాల్లో పేరుకుపోయిదంటే ఆశ్చర్యం కలగక మానదు. దీనికితోడు అదనంగా హెచ్‌ఆర్‌ఏ లభించడం, హైదరాబాద్‌కు పటాన్‌చెరు సమీపంగా ఉండటంతో ఇక్కడ పనిచేసేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. కానీ ఈ పోస్టు దక్కడం అంత సులువేమీ కాదు. పోలీసు శాఖలో ఉన్నతాధికారుల ఆశీస్సులతోపాటు  రాజకీయ పలుకుబడి ఉంటే తప్ప ఇక్కడ పోస్టింగ్ రాదని పోలీసు వర్గాల్లో విస్తృత ప్రచారంలో ఉంది. అయితే అన్ని కష్టాలు పడి ఈ పోస్టింగ్ దక్కించుకున్నా ఎక్కువ కాలం అక్కడ  కొనసాగలేకపోతున్నారు.

 ఇలా వచ్చి.. అలా వెళ్తున్నారు..
ఈ సీటు జిల్లాలోనే హాట్ కేకులా మారింది. ఈ పోస్టును దక్కించుకున్న వారంతా ఇలా వచ్చి ... అలా వెళ్తున్నారు. సగటున 8 నెలలకంటే ఎక్కువగా పనిచేసే వాతావరణం ఇక్కడ లేదు.  2010 నుంచి బదిలీ వ్యవహారం ఇలానే సాగుతోంది. 2010 నవంబర్ 21న పటాన్‌చెరు బాస్‌గా బాధ్యతలు స్వీకరించిన కె.కిష్టయ్య ఆరు నెలలు మాత్రమే పనిచేయగలిగారు. ఏమైందో ఏమో కానీ, అర్ధంతరంగా బదిలీ చేసి రవీందర్ రెడ్డిని నియమించారు. ఆయన కిందామీదపడి రెండేళ్లు పూర్తి చేశారు. వెంటనే ఆయన్నూ బదిలీ చేసి శంకర్ రెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు. ఆయన కేవలం 18 నెలలపాటు పనిచేయగా కిష్టయ్యకు బాధ్యతలు అప్పగించారు.

శంకర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డిలకు ఆర్థిక, రాజకీయ పలుకుబడితోపాటు సామాజికవర్గ నేపథ్యంలో కనీసం అటు ఇటుగా రెండేళ్ల కాలమైనా పనిచేయగలిగారు. కృష్ణయ్య పూర్తికాలం ఉంటారని అందరూ భావిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా ఆరు నెలలలోపే బదిలీ చేశారు. ఆయన బదిలీకి కారణాలేంటో ఎవరికీ తెలియదు. ఆయన బదిలీపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఇందులో ఏది నిజమో బదిలీ చేసిన అధికారులకే తెలియాలి. ఆ తర్వాత లింగేశ్వర్‌రావు బాధ్యతలు చేపట్టారు. 26 ఆగస్టు 2015న పటాన్‌చెరుకు అటాచ్ అయిన లింగేశ్వర్‌రావు ఆ తర్వాత.. 15 అక్టోబర్ 2015న ఇక్కడే పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. ఈయన కూడా ఎనిమిది నెలలలోపే బదిలీ ఉత్తర్వులు అందుకోవాల్సివచ్చింది. ఆయన స్థానంలో కొత్తగా ప్రభాకర్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఈయన కూడా ఎంతకాలం ఉంటారో వేచి చూడాలి మరి.

 బదిలీలపై విమర్శల వెల్లువ...
పటాన్‌చెరు పోలీస్ బాసులు స్వల్పకాలంలోనే బదిలీలు అవుతుండటం విమర్శలకు దారితీస్తోంది. సీఐలు పూర్తికాలం పనిచేయకపోవటం వల్ల ఇక్కడ శాంతిభద్రతలు అదుపులోకి రావడం లేదని తెలుస్తోంది. అదీగాక నేరాలతోపాటు రోడ్డు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. తరచూ అధికారులను మార్చడం వల్ల ప్రజలకు పోలీసులపై విశ్వాసం సన్నగిల్లుతోంది. ఈ వ్యవహారంపై ప్రజలు, రాజకీయ వర్గాలతోపాటు పోలీసుశాఖలోనూ అంతర్గత విమర్శలకు దారితీస్తోంది.

మరిన్ని వార్తలు