సాగునీటి కోసం ఎదురుచూపు

25 Aug, 2016 19:26 IST|Sakshi
సాగునీటి కోసం ఎదురుచూపు
కోడూరు :
 ‘ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా, నేటికీ కాలువలకు సాగునీరు ఇవ్వలేదు. సాగునీరు ఇవ్వలేని పక్షంలో ప్రభుత్వమే పంటవిరామం ప్రకటించాలి. నష్టపరిహారం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి...’ అని పలువురు రైతులు ఇరిగేషన్‌ అధికారులను నిలదీశారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో డీసీ అధ్యక్షుడు పాలేటి జగన్మోహనరావు అధ్యక్షతన సాగునీటి విడుదలపై ఇరిగేషన్‌ అధికారులతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతు సంఘం జిల్లా నాయకుడు ఆవుల బసవయ్య మాట్లాడుతూ ఇప్పటి వరకు దిగువ కాలువలకు నీరు రాకపోవడంతో 15వేల ఎకరాల్లో వరి సాగు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. డెల్టా ఆధునికీకరణ పనులను ఇష్టానుసారంగా నిర్వహించడం వల్ల కాలువల వెంట వచ్చే కొద్దిపాటి సాగునీరు కూడా దిగువకు వెళ్లడం లేదన్నారు. ఈ సమస్యలను పరిష్కరించలేకపోతే ప్రభుత్వమే పంటవిరామం ప్రకటించి, రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. తీరప్రాంతాల్లో రెండేళ్లుగా పంటలు లేక భూములు బీడువారాయని, ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉంటే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని రామకష్ణాపురం మాజీ ఉప సర్పంచి దేవనబోయిన వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తంచేశారు. కాలువల పనులను ఇష్టానుసారంగా చేస్తున్నారని హంసలదీవి మాజీ సర్పంచి వేణుగోపాలరావు మండిపడ్డారు. 
సమస్యను పరిష్కరించేందుకు చర్యలు : డీఈ
మండలంలో సాగునీటి సమస్యలను ఉన్నతాధికారులకు వివరించి, పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్‌ డీఈ వేణుగోపాలరావు రైతులకు హామీ ఇచ్చారు. కాలువల ఎగువ నుంచి దిగువ భూముల వరకు అనధికార తూములను తొలగించి, ప్రతి ఎకరాకు నీటిని అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. ఎంపీపీ మాచర్ల భీమయ్య, జెడ్పీటీసీ సభ్యుడు బండే శ్రీనివాసరావు, డీసీ ఉపాధ్యాక్షుడు కాగిత రామారావు, ఇన్‌చార్జి ఏఈ శ్రీనివాస్, నీటి సంఘాల అధ్యక్షులు, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు