క్వీన్‌మేరిస్‌ పాఠశాల కరస్పాండెంట్‌ మృతి

5 Oct, 2016 00:02 IST|Sakshi

ప్రొద్దుటూరు కల్చరల్‌: పట్టణంలోని క్వీన్‌ మేరిస్‌ ఐసీఎస్‌సీ సెంట్రల్‌ స్కూల్‌ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్‌ పాలగిరి సుధీకర్‌ మంగళవారం ఉదయం 7.30 గంటలకు గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈయన ప్రొద్దుటూరులో 1984లో ఐసీఎస్‌సీ సెంట్రల్‌ సిలబస్‌తో పాఠశాల నెలకొల్పారు. 32 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరు సంపాదించారు. విద్యారంగంలో చేసిన సేవలకుగాను 15 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు. బెస్ట్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా, ఏసియా అడ్మిరబుల్‌ అచీవర్స్, కోహినూర్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ఇండియా, ఇండో అమెరికా హౌస్‌ హూ వంటి అవార్డులతో దేశ, విదేశాలలోని ప్రముఖుల చేత సత్కారం పొందారు. రోటరీ ఇంటర్నేషనల్‌ క్లబ్‌లో సభ్యునిగా వివిధ రంగాలలో సేవలు అందించి అందరి మన్ననలు పొందారు. ప్రొద్దుటూరు, కడపలో క్వీన్‌ మేరిస్‌ పాఠశాలలను స్థాపించారు. గ్రూప్‌–1 పరీక్షలో ఉత్తీర్ణులై కోఆపరేటివ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నతాధికారిగా ఉండి, విద్య పట్ల ఆసక్తితో పాఠశాలను ఏర్పాటు చేసి డాక్టరేట్‌ను పొందారు. భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. ఈయన అంత్యక్రియలు బుధవారం ఉదయం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  రోటరీ క్లబ్‌ సభ్యులు సాధు గోపాలకృష్ణ, రచయిత జింకా సుబ్రమణ్యం సంతాపం తెలిపారు.

>
మరిన్ని వార్తలు