కిక్‌బాక్సింగ్‌లో జిల్లాకు పతకాలు

2 Oct, 2016 00:25 IST|Sakshi
మహబూబ్‌నగర్‌ క్రీడలు: హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం జరిగిన అండర్‌–19 స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించారు. ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో తొలిసారిగా జిల్లా క్రీడాకారులు ఏడు పతకాలు పొందడం విశేషం. 48 వెయిట్‌ విభాగంలో ఎస్‌.వరుణ్‌కుమార్‌(వనపర్తి) బంగారు పతకం సాధించగా, 44వెయిట్‌ విభాగంలో శ్రీకాంత్‌ (గంగాపూర్‌), 52 వెయిట్‌లో ఎం.నవీన్‌కుమార్‌ (కొత్తకోట), 60 వెయిట్‌లో మహిపాల్‌( గంగాపూర్‌) రజతం, 65 వెయిట్‌లో జె.శ్రీధర్‌ (మిడ్జిల్‌), 44 వెయిట్‌ బాలికల విభాగంలో జె.సురేఖ (కొత్తకోట), 50 వెయిట్‌లో నందిని (లింగంపేట) కాంస్య పతకాలు పొందారు. టోర్నీలో బంగారు పతకం సాధించిన వరుణ్‌కుమార్‌ వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 7 వరకు ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి అండర్‌–19 కిక్‌బాక్సింగ్‌ పోటీలకు ఎంపికయ్యాడు. పతకాలు సాధించిన క్రీడాకారులను శనివారం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో డీవీఈఓ హన్మంతరావు అభినందించారు. రాష్ట్రస్థాయి టోర్నీలో పతకాలు సాధించడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో రాణించాలని ఆకాంక్షించారు. ఎస్‌జీఎఫ్‌ సర్టిఫికెట్లకు విద్యా, ఉద్యోగాలలో ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో అండర్‌–19 ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి రాంచందర్, పీడీ పాపిరెడ్డి, సత్యనారాయణ, జిల్లా కిక్‌బాక్సింగ్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి శేఖర్, సంయుక్త కార్యదర్శి అబ్దుల్‌ నబీ, కార్యనిర్వాహక కార్యదర్శి కేశవ్‌గౌడ్, శివకుమార్‌ యాదవ్, నరేష్‌ పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు