దోమలకాలం.. నివారణే మార్గం

8 Sep, 2016 19:24 IST|Sakshi
దోమలకాలం.. నివారణే మార్గం
– ప్రజలు భాగస్వాములు కావాలి
– డీఎంహెచ్‌వో డాక్టర్‌ యు.స్వరాజ్యలక్ష్మి
 
కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలో పలు ప్రాంతాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇటీవల భారీ వర్షాలు కురిసి...దోమలు వృద్ధి చెందడంతో జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దోమకాటు బారినపడకుండా ఎవరికి వారు స్వీయ నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ యు. స్వరాజ్యలక్ష్మి చెప్పారు. గురువారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. మలేరియా విభాగం దోమల నివారణకు చర్యలు చేపడుతోందని, దీనికి ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమన్నారు.  ఇళ్లు, పరిసరాల్లో దోమల నివారణ చర్యలు చేపడితే విషజ్వరాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. ఈ సందర్భంగా దోమల వల్ల వచ్చే వ్యాధులు, నివారణ చర్యల గురించి ఆమె వివరించారు. 
దోమకాటు వల్ల వచ్చే వ్యాధులు 
 మలేరియా : ఆడ అనఫిలిస్‌ దోమకాటు వల్ల వస్తుంది.
లక్షణాలు: వణుకుతో కూడిన చలిజ్వరం, చెమటలు పట్టడం, తలనొప్పి, జ్వరం రోజు విడిచి రోజు రావడం, వాంతులు అవడం.
 మెదడువాపు వ్యాధి ః జపనీస్‌ ఎన్‌సెఫలిటిస్‌ దోమకాటు వల్ల వస్తుంది. పందులు, పశువులను కుట్టిన దోమలు మనుషులకు కుట్టిన వెంటనే రక్తం ద్వారా వ్యాధి కారక క్రిములు మెదడుకు చేరి మెదడువాపు వ్యాధి వస్తుంది.
 లక్షణాలు : ఈ వ్యాధి ముఖ్యంగా 14 సంవత్సరాల్లోపు పిల్లలకు ఎక్కువగా వస్తుంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులు, స్పహతప్పడం వంటి లక్షణాలు ఉంటాయి. 
 
డెంగీ : ఏడిస్‌ ఈజిపై ్ట అనే దోమ ద్వారా డెంగీ వ్యాధి వస్తుంది. 
లక్షణాలు: ఈ దోమలు పగటిపూట మాత్రమే కుడతాయి. తీవ్రమైన జ్వరం, శరీరంపై దద్దుర్లు, చర్మం ద్వారా రక్తస్రావం, తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. కండరాలు, కీళ్లనొప్పులు, ఆకలి మందగించడం జరగవచ్చు. దీంతో ఒక్కసారి ఒంట్లో రక్తస్రావం జరిగి ప్రాణాలకు ముప్పు రావచ్చు.
 పైలేరియా(బోదకాలు): క్యూలెక్స్‌ దోమకాటు వల్ల వస్తుంది. 
లక్షణాలు : జ్వరం రావడం, వృషణాల్లో వాపు, కాళ్లలో నీరసం, కాళ్లవాపు, ప్రత్యేకించి కళ్లు, చేతులు, స్థనాలు, జననేంద్రియాలు పాడవడం ఈ వ్యాధి ముఖ్యలక్షణాలు.
 చికున్‌ గున్యా : చికున్‌ గున్యా జ్వరం వైరస్‌ సోకడం వల్ల వస్తుంది. ఈ వైరస్‌ పగటి పూట పులిదోమ కాటు వల్ల వస్తుంది. 
లక్షణాలు : జ్వరం, భరించలేనంతగా కళ్లు, కండరాల నొప్పులు, వాంతి అవుతున్నట్లుగా, దాహం అధికంగా ఉండటం, తీవ్రమైన ఒళ్లునొప్పులు దీర్ఘకాలంగా ఉంటాయి. 
 
నివారణ చర్యలు  
– ఇంటి పరిసరాల్లో దోమలు పెరిగేందుకు అనువుగా ఉండే నీటి నిల్వలను నిర్మూలించాలి. 
–తాగి పారేసిన కొబ్బరిబోండాలను ముక్కలుగా చేసి చెత్తకుండీలో వేయాలి. 
–ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, నీటినిల్వ పాత్రలను, ఎయిర్‌ కూలర్లు, డ్రమ్ములు లాంటి వాటిని పూర్తిగా ఖాళీ చేసి శుభ్రం చేయాలి. 
– కాల్వలో వ్యర్థాలు, చెత్త, చెట్లకొమ్మలు వేయరాదు.
– వారానికి ఒకసారి పూలతొట్టెలలో, పూల కుండీలలో నీరు మార్చాలి.నీరు నిల్వ ఉండకుండా చూడాలి.
– దోమలు లోపలికి రాకుండా కిటికీలకు సన్న జాలిని కట్టాలి. దోమతెరలు తప్పనిసరిగా వాడాలి.
– ప్రతి శుక్రవారం డ్రై  డేగా పాటించాలి. 
–టైర్లు, రోడ్డుపై గుంతలో వర్షపునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి.
–జ్వరం వచ్చిన వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. 
 
>
మరిన్ని వార్తలు