ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిందే..

20 Jun, 2016 01:52 IST|Sakshi
ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిందే..

ఎన్నికల హామీలు మరిచారు
టీపీసీసీ ఉపాధ్యక్షురాలు సబితాఇంద్రారెడ్డి
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు మరిచారు
డబుల్ బెడ్ రూం ఇళ్లతో కేసీఆర్ మాయమాటలు
మంచిర్యాల నియోజకవర్గ సమావేశానికి హాజరు
 

 
మంచిర్యాల రూరల్ : బంగారు తెలంగాణ లక్ష్యమంటూనే ఎన్నికల హామీలను విస్మరిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిందేనని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) ఉపాధ్యక్షురాలు, మాజీ హోంత్రి, పార్టీ జిల్లా ఇన్‌చార్జి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాల మండలంలోని పద్మావతి గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. డబుల్ బెడ్‌రూం తదితర పథకాల్లో సీఎం కేసీఆర్ మాయమాటలు చెప్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నా ఇక్కడ ఇప్పటికీ ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లుకు కూడా కనీసం ముగ్గు పోయలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్న వారికి టీఆర్‌ఎస్‌లో భంగపాటు తప్పదని అన్నారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల వరకు పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. కాగా, సమావేశం మొదటి నుంచి చివరి వరకు పార్టీ శ్రేణులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరును జపించడం విశేషం.


 సోనియూగాంధీకి కానుక ఇవ్వాలి
 రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించడం ద్వారా తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కానుక ఇవ్వాలనికాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు సబిత ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ముందుగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం సబిత ఇంద్రారెడ్డిని ఘనంగా సత్కరించి, అభినందన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరుతున్న వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.


 అప్పుల తెలంగాణగా మారుస్తున్నారు
 మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని లక్ష కోట్ల అప్పుతో అప్పుల తెలంగాణగా మార్చారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టి పథకాలను  అమలు చేయకుండా సీఎం నియంత పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కోదండరాంపై మూకుమ్మడి దాడి శోచనీయమని మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి అన్నారు.

 భారీ ఎత్తున హాజరైన శ్రేణులు
 సమావేశానికి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు సి.రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి గడ్డం అరవిందరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు నరేశ్‌జాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, డీసీసీ ఇన్‌చార్జిలు నెమళ్ల శ్రీనివాస్, ప్రేమలత అగర్వాల్, పి.రవీందర్‌రావు, చిట్ల సత్యనారాయణ, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దుర్గాభవానీ, మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వంగల దయానంద్, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీపతి శ్రీనివాస్, మంచిర్యాల మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు గరిగంటి సరోజ, మండల మాజీ అధ్యక్షుడు అంకం నరేశ్, మైనార్టీ సెల్ నాయకుడు అబ్ధుల్ మన్నాన్, కోల్‌బెల్ట్ అధ్యక్షుడు మోతె కనకయ్య, మంచిర్యాల రూరల్ అధ్యక్షుడు కొట్టె లచ్చన్న, దండేపల్లి అధ్యక్షుడు చిట్ల శ్రీను, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు రేండ్ల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకుడు రాంశెట్టి నరేందర్, మండల యువజన అధ్యక్షుడు చంద్రమౌళి, పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు