Sakshi News home page

ఉత్తమ ఉపాధ్యాయులుగా 54 మంది ఎంపిక

Published Sun, Sep 3 2023 2:06 AM

Telangana Govt selects 54 teachers for Best Teacher Awards - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రస్థాయిలో అవార్డులకు అర్హుల ఎంపికను పాఠశాల విద్యాశాఖ పూర్తి చేసింది. ఈ అవార్డులకు అర్హతలున్న వారికి సంబంధించి జిల్లా స్థాయిలో ప్రతిపాదనలు స్వీకరించిన పాఠశాల విద్యాశాఖ యంత్రాంగం ప్రత్యేక కమిటీ ద్వారా పరిశీలన చేసింది.

ఇందులో భాగంగా నాలుగు కేటగిరీల్లో 97 ప్రతిపాదనలు పరిశీలించిన పరిశీలన కమిటీ... 42 మందిని ఎంపిక చేసింది. అదేవిధంగా ప్రత్యేక కేటగిరీలో మరో 12 మందికి అవకాశం కల్పించింది. మొత్తంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు 54 మందిని ఎంపిక చేసిన పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌... శనివారం వారి పేర్ల జాబితాను ప్రకటించింది.

మంత్రి సబితతో ఉత్తమ ఉపాధ్యాయుల భేటీ
రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబి­తారెడ్డి  ఈ నెల 4వ తేదీన మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌ఐ)లో భేటీ కానున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుల అనుభ­వాలు, విద్యాభివృద్ధికి దోహదపడే ఆలోచనలను వా­రు మంత్రితో పంచుకోనున్నారు. ఉత్తమ ఉపా­ద్యాయ అవార్డుకు ఎంపికైన టీచర్లు ఈనెల 4వ తేదీ­న మధ్యాహ్నం 2గంటల కల్లా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని సూచించారు.

రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి వేడుకలు...
ఈనెల 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి వేడుకలను రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉదయం 10గంటల నుంచి వేడుకలు ప్రారంభమవుతాయని వివరించింది. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.

Advertisement

What’s your opinion

Advertisement