సిట్‌ దర్యాప్తు షురూ

27 Jun, 2017 00:30 IST|Sakshi
సిట్‌ దర్యాప్తు షురూ

విశాఖ సిటీ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ జిల్లా భూకుంభకోణాలపై విచారణకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధికార కార్యకలాపాలు మంగళవారం నుంచి ప్రారంభించనుంది. సిట్‌ బృందంలో కీలక సభ్యురాలైన విశాఖ జాయింట్‌ కలెక్టర్‌ సృజన సెలవులో ఉండటంతో.. జీవో జారీ అయి వారం రోజులు గడిచినా విచారణ ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఆమె రావడంతో మంగళవారం నుంచి అధికారిక విచారణకు రంగంలో దిగేందుకు సిట్‌ బృందం సమాయత్తమవుతోంది. దీనికి సంబంధించిన యాక్షన్‌ ప్లాన్‌ను మంగళవారం సాయంత్రం ప్రకటించే అవకాశముంది.

ఇప్పటి వరకూ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌కు వచ్చిన 168 ఫిర్యాదులపై మాత్రమే విచారణ చేపడతారా.. లేకపోతే.. గ్రీవెన్స్‌కి వచ్చిన ఫిర్యాదులపైనా దృష్టిసారిస్తారా అనే అంశంపై ఇంకా సందిగ్ధం నెలకొంది. రెండు నెలల్లో సిట్‌ బృందం నివేదికను సమర్పించాల్సి ఉండగా.. వారం రోజుల ఆలస్యంగా విచారణ ప్రారంభిస్తున్నారు. మరోవైపు... సిట్‌ కంటే.. సీబీఐ విచారణ, జ్యుడిషియల్‌ ఎంక్వయిరీతోనే భూబాధితులకు న్యాయం జరుగుతుందని అఖిలపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. సీబీఐ విచారణకు ఈ కేసును అందించాలంటూ జీవీఎంసీ కార్యాలయం సమీపంలో గాంధీ విగ్రహం వద్ద లోక్‌సత్తా, సీపీఐ, సీపీఎం, ఆంధ్ర చైతన్య పార్టీల నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

మరిన్ని వార్తలు