ప్రత్యేక హోదా ప్రైవేట్‌ బిల్లుపై భేషజాలు వద్దు

27 Jul, 2016 00:02 IST|Sakshi
ప్రత్యేక హోదా ప్రైవేట్‌ బిల్లుపై భేషజాలు వద్దు
ప్రత్యేక, హోదా, ప్రైవేట్‌, బిల్లుపై, భేషజాలు, వద్దు,support, special, status, bill
రాజకీయాలకు అతీతంగా 5న బిల్లు ఆమోదమయ్యేలా సహకరించాలి
పీసీసీ ప్రధాన కార్యదర్శి రుద్రరాజు
అమలాపురం టౌన్‌ :
నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లుపై ఎన్‌డీఏ కూటమి ఎంపీలు ముఖ్యంగా టీడీపీ ఎంపీలు భేషజాలకు పోకుండా దాని ఆమోదానికి సహకరించాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు అభ్యర్థించారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును కాంగ్రెస్‌ వారు ప్రవేశ పెట్టారన్న భేషజాలకు పోకుండా నవ్యాంధ్ర భవిష్యత్‌ ప్రయోజనాల కోసం పార్టీలు, రాజకీయాలకు అతీతంగా మద్దుతు తెలిపాలని కోరారు. ఒకవేళ కాంగ్రెస్‌ ఎంపీ బిల్లు పెట్టటం మీకు ఇబ్బందికరంగా ఉంటే...కేవీపీ ఆ బిల్లును ఉపసంహరించుకుంటారని... బిల్లు పార్లమెంటులో ఆమోదమయ్యేలా మీరే కృషి సల్పినా మాకు సంతోషమేనని రుద్రరాజు పేర్కొన్నారు. ఆగస్టు అయిదో తేదీన పార్లమెంటులో బిల్లుపై జరిగే ఓటింగ్‌లో పార్టీలను పక్కన పెట్టి  నవ్యాంధ్ర నవ శకానికి ఎంపీలు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో పార్లమెంటులో ఇలా ప్రైవేటు మెంబర్స్‌ ప్రవేశపెట్టిన 14 బిల్లులు ఆమోదం పొందాయన్నారు. శుక్రవారం బిల్లు పెట్టడంపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, టీడీపీ ఎంపీలు వేరే ఉద్దేశాలతో ఆరోపణలు చేయటం తగదన్నారు. ప్రైవేట్‌ మెంబర్స్‌ బిల్లు అనేది కేవలం శుక్రవారం రోజునే ప్రవేశపెడతారన్న వాస్తవాన్ని వారు గ్రహించాలని సూచించారు. నాడు వెంకయ్యనాయుడు రాష్ట్రానికి హోదా అయిదు కాదు పది సంవత్సరాలు ఉండాలని వాదించి ఇప్పుడు నవ్యాంధ్రకు హోదాపరంగా తీరని అన్యాయం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ పార్టీ ఎంపీలకు హోదాపై చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ఎందుకు ఆయుధంగా ఉపయోగించుకోవటంలేదని రుద్రరాజు ప్రశ్నించారు. అంటే వారు ఈ తరహా బిల్లు ఎలాగూ పెట్టరు, పెట్టిన పార్టీలకు వంకలు పెట్టి విమర్శలు చేస్తున్నారంటే హోదాపై అసలు చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోందన్నారు. ఎంపీ కేవీపీ పెట్టిన బిల్లుకు పార్లమెంటులో ఎనిమిది రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతుండగా వీరు విమర్శిస్తున్నారంటే, రాష్ట్రంలోని టీడీపీ ఎంపీలకు హోదాపై ఆవేదన... ఆలోచన అసలు లేదని అర్థం అవుతోందని రుద్రరాజు అన్నారు.
మరిన్ని వార్తలు