-

పొన్నూరులో టెన్షన్‌..టెన్షన్‌

10 Oct, 2016 23:42 IST|Sakshi
పొన్నూరులో టెన్షన్‌..టెన్షన్‌
 
  • ఉద్రిక్త పరిస్థితుల నడుమ డాక్టర్‌ రాజారావు అరెస్టు
  • అడ్డుకున్న మహిళలపై పోలీస్‌ ప్రతాపం
  •  లాఠీలతో కొట్టి తరలింపు
 
పొన్నూరు : ఉద్రిక్త పరిస్థితుల మధ్య పొన్నూరులోని ప్రజావైద్యశాల వైద్యుడు డాక్టర్‌ టీ. రాజారావును సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆయన అరెస్టును అడ్డుకోవడానికి ప్రయత్నించిన పలువురు మహిళలను లాఠీలతో కొట్టి, అదుపులోకి తీసుకుని భట్టిప్రోలు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన పూర్వాపరాలు...
  డాక్టర్‌  రాజారావుపై పోలీసులు అక్రమంగా పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఐక్యవేదిక ప్రదర్శనకు పిలుపునిచ్చింది.  ఈ ప్రదర్శనను జయప్రదం చేయడానికి గత మూడురోజులుగా  కషిచేశారు.  సోమవారం ఉదయం ర్యాలీగా బయలుదేరి తాహశీల్దార్‌ కార్యాలయంలో  ‘ప్రజావాణి’లో అర్జీ ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. అయితే  పోలీసులు పట్టణంలో 144 సెక్షన్‌  అమలు చేశారు. దీంతో రాజారావు మద్దతుదార్లతో పాటు పట్టణంలో సామాన్య ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడ్డారు. 
  ప్రజావైద్యశాలకు వచ్చి వినతి స్వీకరించిన తహశీల్దార్‌ 
  పట్టణంలోని ప్రజావైద్యశాలకు ఉన్న రాకపోకలన్నింటిని పోలీసులు దిగ్బంధం చేశారు. ఆసుపత్రికి వస్తున్న రోగులను కూడా అడ్డుకున్నారు. అయినప్పటికీ అతి కష్టంమీద కొంతమంది కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకున్నారు. జనసమీకరణ జరిగిన∙నేప«థ్యంలో డాక్టర్‌ రాజారావు గ్రీవెన్స్‌లో వినతిపత్రం ఇవ్వడానికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరువార్గాల మధ్య కొంత వాగ్వాదం జరగ్గా... తహశీల్దార్‌ వినతిపత్రం తీసుకోవడానికి రావాలని పట్టుబట్టడంతో తహశీల్దార్‌ ప్రజావైద్యశాల ప్రాంగణానికి చేరుకొని వినతిపత్రాన్ని స్వీకరించారు. 
ర్యాలీ భగ్నం...అరెస్టులు
డాక్టర్‌ రాజారావుకు మద్దతుగా వచ్చిన మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో వారంతా తహశీల్దార్‌ కార్యాలయం వద్దకు చేరి ఆందోళన చేపట్టారు.  ఈ క్రమంలో ప్రజావైద్యశాల నుంచి రాజారావు అక్కడకు చేరుకుని వారికి మద్దతుగా నిలిచారు.  అభిమానులతో కలిసి జీబీసీరోడ్డు మీదుగా ప్రజావైద్యశాలకు ర్యాలీగా వెళ్లే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ యుద్ధ వాతావరణం చోటుచేసుకుంది. ఈ నేప«థ్యంలో రాజారావును  పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఈసమయంలో మహిళలు పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు మహిళలను కూడా అదుపులోకి తీసుకొని, వారి ప్రతాపం చూపించారు. ఈసమయంలో పాత పోలీస్‌స్టేషన్‌ ప్రాంతం మొత్తం రణరంగంగా మారింది. మహిళలు, పురుషులు అనే భేదం లేకుండా లాఠీలతో కొట్టారు.  మహిళా కార్యకర్తలను డీసీఎం వ్యాన్‌లో భట్టిప్రోలుకు, నాయకులను చందోలు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.   డాక్టర్‌ రాజారావును ఓ ప్రై వేటు వాహనంలో గుంటూరు వైపు తీసుకెళ్ళారు.  
మరిన్ని వార్తలు