జ్ఞానబుద్ధ పుష్కరఘాట్‌లో కూలిన టెంట్లు

14 Aug, 2016 18:56 IST|Sakshi

- ఇనుప రాడ్దులు తగిలి భక్తులకు గాయాలు
అమరావతి(గుంటూరు జిల్లా)

కృష్ణా పుష్కరాల్లో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనపడుతోంది. గుంటూరు జిల్లా అమరావతిలోని జ్ఞానబుద్ధ పుష్కరఘాట్‌లో ఆదివారం భక్తుల రద్దీ అధికం కావటంతో శనివారం సాయంత్రమే టెంట్‌లను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 11-12గంటల మధ్య ఘాట్లలో తీవ్రంగా గాలులు వీయటంతో ఒక్కసారిగా రెండు టెంట్‌లు పడిపోయాయి. పూర్తిస్థాయిలో జాగ్రత్తలు పాటించకపోవటంతో 24 గంటలు తిరగముందే టెంట్ కుప్పకూలింది.

 

దీనితో ఇనుపరాడ్డులు తగిలి భక్తులు గాయాలపాలయ్యారు. ఒక్కసారిగా జరిగిన హాఠాత్ పరిణామానికి భక్తులు భయాందోళన చెందారు. ఒంగోలుకు చెందిన సీహెచ్ ప్రసన్నకు తలకు, గుంటూరు నల్లచెరువుకు చెందిన సాయిలిఖిత, సంగడిగుంటకు చెందిన బాబులకు తీవ్ర గాయాలయ్యాయి. దీనితో అక్కడే ఉన్న వారి బంధువులు, రెడ్‌క్రాస్ తరుఫున వచ్చిన విద్యార్థులు హుటాహుటిన క్షత్రగాత్రులను తీసుకుని కమాండ్ కంట్రోల్‌రూమ్ వద్ద ఉన్న ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు.


ఒక్క అధికారి లేరు....
సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఒక్క అధికారి కూడా లేరని బాధితులు చెబుతున్నారు. కనీసం ఆసుపత్రికి తీసుకుని వెళ్ళే సమయంలో కూడా ఏ ఒక్కరూ తోడు రాలేదని ఆరోపించారు. అధికారులు ఏర్పాట్లు సక్రమంగా చేసి ఉంటే ఇటువంటి పరిస్ధితి వచ్చి ఉండేది కాదని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌లు బాధితులను పరామర్శించారు.

మరిన్ని వార్తలు