ప్రేమకు అడ్డుపడ్డాడని.. యువకుడి దారుణహత్య

1 Mar, 2017 02:36 IST|Sakshi
ప్రేమకు అడ్డుపడ్డాడని.. యువకుడి దారుణహత్య

నిందితులు బావ బావమరుదులు
 ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం
ఇబ్రహీంపట్నంలో కలకలం


ఇబ్రహీంపట్నం(కోరుట్ల) : తనకు ప్రేమకు అడ్డుపడుతున్నాడని, ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడని కక్ష పెంచుకున్న ఓ యువకుడు వరుసకు బావను బావమరిదితో కలిసి కత్తులతో పొడిచి అతి కిరాతకంగా హతమార్చాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో కలకలం సృష్టించింది. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. ఎర్దండి గ్రామానికి చెందిన అవుట్ల శివరాజ్, అవుట్ల సునిల్‌ అలియాస్‌ రాజేశ్‌ వరుసకు అన్నదమ్ములు. రాజేశ్‌కు అదే గ్రామానికి చెందిన అవుట్ల అజయ్‌ మేనబావ. అజయ్‌ రెండేళ్లక్రితం అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించడంతో ఈ విషయాన్ని శివరాజ్‌ యువతి తల్లిదండ్రులకు చెప్పాడు. వారు అజయ్‌ను మందలించారు. అవమానభారంతో అజయ్‌ అప్పుడే క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందాడు. అప్పటినుంచి శివరాజ్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో శివరాజ్‌ గల్ఫ్‌ వెళ్లి నెలక్రితమే తిరిగివచ్చాడు. అప్పటినుంచి శివరాజ్‌తో స్నేహం చేస్తున్నట్లు నటిస్తూ వచ్చాడు. ఆదివారం కొందరు యువకులతో కలిసి విందు చేసుకున్నారు. ఆ విందుకు తన బావమరిదితోపాటు శివరాజ్‌నూ ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు.

రాత్రికావడంతో ఇళ్లకు బయల్దేరారు. అప్పటికే రగిలిపోతున్న అజయ్‌.. శివరాజ్‌ను ఎలాగైనా చంపాలని పథకం వేసుకుని.. ద్విచక్రవాహనాన్ని కోమటికొండాపూర్‌ శివారులోకి తీసుకెళ్లాడు. అక్కడి లింక్‌రోడ్డులో వెంట తెచ్చుకున్న కత్తితో శివరాజ్‌ను విచక్షణరహితంగా పొడిచి ఇంటికి చేరుకున్నాడు. శివరాజ్‌కు యాక్సిడెంట్‌ అయ్యిందని, తీవ్ర గాయాలయ్యాయంటూ సునిల్‌ ఫోన్‌ద్వారా కుటుంబసభ్యులకు సమాచారమిచ్చాడు. వారు అక్కడికి చేరుకుని రక్తపుమడుగులో కొట్టుకుంటున్న శివరాజ్‌ (24)ను మెట్‌పల్లి ఆసుపత్రికి.. అక్కడినుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా.. జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు వివరించిన శివరాజ్‌ మార్గంమధ్యలో చనిపోయాడు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు అజయ్‌తోపాటు సునిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని మెట్‌పల్లి డీఎస్పీ మల్లారెడ్డి, సీఐ సురేందర్, ఎస్సై ప్రసాద్‌ పరిశీలించారు. మృతుడి తండ్రి అవుట్ల నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

మరిన్ని వార్తలు