ఇద్దరు స్నేహితులు దుర్మరణం

10 Apr, 2017 23:35 IST|Sakshi
ఇద్దరు స్నేహితులు దుర్మరణం
- సల్కాపురం సమీపంలో బైక్‌, లారీ ఢీ
- యువకుడి, యువతి మృతి
- పోలీసుల అదుపులో లారీ డ్రైవర్‌
   
కల్లూరు/ గూడూరు రూరల్‌: అతి వేగం ఇద్దరు ప్రాణాలను బలి తీసుకుంది. కర్నూలు - బళ్లారి జాతీయ రహదారిపై సల్కాపురం సమీపంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు, యువతి దుర్మరణం చెందారు. మృతులు ఇద్దరు స్నేహితులు. కర్నూలులోని లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్న రాజేష్‌ (21) ఓ ప్రైవేట్‌ మెడికల్‌ ఏజెన్సీలో ఫీల్డ్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. కర్నూలులోని నంద్యాల చెక్‌ పోస్టు సమీపంలో నివాసముంటున్న రేణుక(20) నగరంలోని జ్యోతి మాల్‌లోని వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. సోమవారం మధ్యాహ్నం వీరు బైక్‌పై నాగులాపురం వైపు వెళ్తుండగా సల్కాపురం సమీపంలో కర్ణాటక నుంచి విజయవాడకు అల్లం లోడుతో వెళ్తున్న లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన వీరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
 
ఏసు, సుశీలమ్మ దంపతులకు రాజేష్‌ ఒక్కగానొక్క కుమారుడు. ముగ్గురు అక్కాచెల్లెల్లు ఉన్నారు. చిన్నతనంలోనే రాజేష్‌  తండ్రినికోల్పోయాడు. సుశీలమ్మ పిల్లలను పెంచి పెద్ద చేసింది. చేతికొచ్చిన కుమారుడు ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్న సమయంలో మృతి చెందడంతో తల్లి రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. కరూలు నగరంలోని టెలికాంనగర్‌లో నివశిస్తున్న సాయిబాబు, ప్రమీళమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. చివరి సంతానం రేణుక డిగ్రీ పూర్తి చేసినా ఉద్యోగం రాకపోవడంతో కుటుంబ పోషణ నిమిత్తం జ్యోతిమాల్‌లో వర్కర్‌గా చేరింది. రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.   
 
 సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
రోడ్డు ప్రమాద సంఘటన సమాచారం తెలిసిన వెంటనే ఎస్పీ ఆకె రవికృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని  ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన మృతదేహాలను,  ప్రమాదానికి కారణమైన లారీ, ద్విచక్ర వాహనాలను పరిశీలించారు. ఓవర్‌టేక్‌ చేస్తూ అతివేగం వల్ల ప్రమాదం జరిగిందా, ఇతర కారణాలా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. లారీ డ్రైవర్‌ షేక్‌ సుభాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ డీవీ రమణమూర్తి, సీఐ నాగరాజు యాదవ్, ఎస్‌ఐలు వెంకటేశ్వరరావు, మల్లికార్జున, పోలీసు సిబ్బంది ఉన్నారు.     
 
మరిన్ని వార్తలు