ఆర్‌బీఐ చరిత్ర ఇదీ..!

7 Mar, 2018 12:53 IST|Sakshi

నిడమర్రు: దేశంలోని బ్యాంకు వడ్డీ రేటులు నిర్ణయించడంతోపాటు ద్రవ్య సరఫరాను నియంత్రించి ఆర్థిక వ్యవస్థను సమన్వయపరిచేదే రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ). దేశ అత్యున్నత బ్యాంకు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా పూర్వ చరిత్ర, ఆబ్యాంక్‌ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

తొలుత కలకత్తాలో..ఆర్‌బీఐ  ప్రధాన కార్యాలయం మొదట్లో కోల్‌కత్తాలో ఉండేది. 1937లో ఆ కార్యాలయాన్ని ముంబైకి మార్చారు. ఉద్యోగుల శిక్షణ కోసం ఆర్బీఐ రెండు శిక్షణ సంస్థలను నిర్వహిస్తోంది. చెన్నైలో రిజర్వ్‌ బ్యాంక్‌ స్టాఫ్‌ కాలేజీ, మరోటి మహారాష్ట్రలోని పుణేలో వ్యవసాయ బ్యాంకింగ్‌ శిక్షణ కళాశాల ఉంది.

ప్రైవేటు నుంచి ప్రభుత్వ సంస్థగా
ఇప్పుడున్న ఆర్‌బీఐ 1935 ఏప్రిల్‌లో ఏర్పాటైంది. ఇది వాటాదారుల బ్యాంకుగా మొదట్లో ఉండేది. ఆర్‌బీఐ జాతీయకరణ 1949లో జరిగింది. తర్వాత పూర్తి ప్రభుత్వ సంస్థగా మారింది. 1969లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 14 బ్యాంకులను జాతీయకరణ చేయడం దేశంలో కీలక మలుపు. తర్వాత మరో 6 బ్యాకులను జాతీయకరణ చేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత ప్రభుత్వరంగ బ్యాంకులన్నీ అజమాయిషీ చేసే అధికారాలు ఆర్‌బీఐకి సంక్రమించాయి.

ఆర్‌బీఐ పాత్ర..
1947 వరకూ ఆర్బీఐ బర్మా దేశానికి సైతం కేంద్ర బ్యాంకుగా పనిచేసింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రెండేళ్లు జపాన్‌ కింద బర్మా ఉన్నప్పుడు మాత్రం ఆర్‌బీఐ అజమాయిషీ లేదు. పాకిస్థాన్‌ విషయంలో 1947 ఆగస్టు 14 తర్వాత ఆర్‌బీఐ సెంట్రల్‌ బ్యాంకుగా పనిచేసింది.

నోట్ల ముద్రణ..
ఆర్‌బీఐ సొంత సంస్థ అయిన ‘ది భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ నోట్‌ ముద్రణ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ దేశంలో నోట్ల ముద్రణ వ్యవహారాలను చూస్తుంది. ఇది మైసూర్, పశ్చిమ బెంగాల్‌ కేంద్రాల్లో నోట్ల ముద్రణ కేంద్రాలను కలిగి ఉంది. ఇవే కాకుండా మహారాష్ట్రలోని నాసిక్, కర్ణాటకలోని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ కేంద్రాల్లో సైతం నోట్ల ముద్రణ చేస్తున్నారు. ఆర్‌బీఐ కేవలం నోట్ల ముద్రణ వరకే పరిమితం అవుతుంది. నోట్లు కాకుండా కేవలం నాణేల ముద్రణను భారత ప్రభుత్వం చేపడుతుంది. చాలామంది నోట్ల ముద్రణ, నాణేల ముద్రణ రెండూ అర్బీఐ ఒకటే చేపడుతుందని అపోహ పడుతుంటారు.

మహిళా డిప్యూటీ గవర్నర్‌
ఆర్‌బీఐ ఇప్పటిదాకా గవర్నర్లుగా మహిళలకు అవకాశం కలగలేదు.  1935లో ఆర్‌బీఐ ప్రారంభం నుంచి ఒకే ఒక మహిళా డిప్యూటీ గవర్నర్‌గా పనిచేశారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 2003లో కేజీ ఉదేశీ డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ఆర్‌బీఐ విస్తరణ..
ఆర్‌బీఐ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలు ఢిల్లీ, కోల్‌కత్తా, చెన్నై, ముంబైల్లో ఉన్నాయి. ఇతర ప్రాంతీయ కార్యాలయాలు 19 చోట్ల ఉన్నాయి. అహ్మదాబాద్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, బెంగుళూరు, జైపూర్, గౌహతి, ఐజ్వాల్, డెహ్రాడూన్, చెన్నై, జమ్మూ, కోచ్చి, లక్నో, కోల్‌కత్తా, పాట్నా, నాగ్‌పూర్, ముంబై, పాట్నా, తిరువనంతపురంలో 19 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.  ఉత్తర ప్రాంతానికి సంబంధించి ఢిల్లీ, దక్షిణ భారతానికి సంబంధించి చెన్నై, పశ్చిమ ప్రాంతానికి సంబంధించి ముంబై, ఈశాన్య ప్రాంతానికి సంబంధించి కోల్‌కత్తా ఆర్‌బీఐ వ్యవహారాలను పర్యవేక్షిస్తాయి.

ఆర్‌బీఐ లోగో..
ఈస్ట్‌ ఇండియా కంపెనీ డబుల్‌ మెహర్‌ ఆధారంగా ఆర్‌బీఐ సీల్‌ ఉంటుంది. నిజానికి అప్పటి ఈస్ట్‌ ఇండియా కంపెనీ రూపే ఉండేట్టు చేయాలని మొదట్లో అనుకున్నారు. ఇప్పటి లోగోలు ఒక సింహం బొమ్మ, తాటిచెట్టు ఉంటాయి. తర్వాత సింహం స్థానంలో జాతీయ జంతువు అయిన పులిని తీసుకొచ్చారు. ఇప్పుడున్న ఆర్‌బీఐ లోగోలో పులి బొమ్మ, తాటి చెట్లతో కూడుకుని ఉంటాయి.

ఆర్‌బీఐ ఆర్థిక సంవత్సరం
ఎక్కడైనా ఆర్థిక సంవత్సరం సాధారణంగా ఏప్రిల్‌ 1తో మొదలై మార్చి 31తో ముగుస్తుంది. కానీ ఆర్‌బీఐ విషయంలో అలా కాదు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆర్థిక సంవత్సరం మాత్రం జులై 1తో మొదలై జూన్‌ 30తో ముగుస్తుంది. దేశంలో బ్యాంకులు, ఇతర ప్రభుత్వ సంస్థలతో పోలిస్తే ఇది పూర్తి భిన్నంగా ఉంది. ఆర్‌బీఐ ఏప్రిల్, మే జూన్‌ల్లో మూడు నెలల పాటు క్షుణ్ణంగా బ్యాంకు ఖాతాలను పరిశీలించి వార్షిక నివేదిక తయారుచేస్తుంది. అలా జులై 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరాన్ని మొదలెడుతుంది.

నోట్ల మార్పిడి..
మనకు గత ఏడాది పెద్ద నోట్ల మార్పిడి(రద్దు) జరిగినప్పుడు అదంతా ప్రభుత్వ కార్యక్రమంలా కనిపించింది. కరెన్సీ నోట్ల నిర్వహణనుచేపట్టేది మొత్తం ఆర్‌బీఐనే. ఆర్‌బీఐ మొదట్లో 1938లో రూ.5 వేలు, రూ.10 వేల నోట్లను రద్దు చేసింది. తర్వాత 1954లో మళ్లీవాడుకలోకి తెచ్చారు. తర్వాత 1978లో మళ్లీ రద్దు చేశారు. దాదాపు 4 దశాబ్ధాలుతర్వాత రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేశారు. తొలిసారి రూ.2 వేల నోట్లను చలామణీలోకి తెచ్చారు. 

మరిన్ని వార్తలు