ఆచితూచి అడుగేయాలి

29 Aug, 2019 01:10 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వానికీ, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ)కూ మధ్య ఎట్టకేలకు సఖ్యత కుది రింది. ఎంతో వివాదాస్పదంగా, జటిలంగా కనిపించిన నగదు నిల్వల బదిలీ వ్యవహారం సుఖాం తమైంది. దాదాపు ఏడాది నుంచి ఇద్దరికీ మధ్య కొనసాగుతూ వస్తున్న ఘర్షణ వాతావరణం పలు పరిణామాలకు దారితీసింది. ఎన్‌డీఏ ప్రభుత్వం నియమించిన ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ఈ వ్యవహారంలోనే ప్రభుత్వంతో విభేదించి నిరుడు డిసెంబర్‌లో నిష్క్రమించారు. డిప్యూటీ గవర్నర్‌ విరాళ్‌ ఆచార్య సైతం ‘వ్యక్తిగత కారణాలతో’ రెండు నెలలక్రితం తప్పుకున్నారు. వీరిద్దరే కాదు... నగదు నిల్వల బదిలీపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీతో కూడా ప్రభుత్వానికి సమస్యలొచ్చాయి. 

ఆ కమిటీలో కేంద్రం తరఫున సభ్యుడిగా ఉన్న కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఇతర సభ్యులతో గట్టిగా వాదించారు. ప్రభుత్వం అడిగినంతా ఇవ్వడం సాధ్యం కాదని కమిటీకి నేతృత్వం వహించిన బిమల్‌ జలాన్‌ చెప్పారు. అత్యవసర పరి స్థితులు ఏర్పడిన పక్షంలో రంగంలోకి దిగడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ దగ్గరుంచుకోవాల్సిన నిధులపై భిన్నాభిప్రాయాలున్నాయి. అమెరికా, బ్రిటన్‌లలో ఈ నిధులు వాటి మొత్తం ఆస్తుల్లో 13 నుంచి 14 శాతం మించవని... మనదగ్గర మాత్రం ఆర్‌బీఐ 25 శాతం నిధుల్ని రిజర్వ్‌లో ఉంచుతున్నదని ప్రభుత్వ వర్గాల వాదన. ఏమైతేనేం ఎప్పుడూలేని విధంగా కేంద్రానికి రూ. 1,76,051 కోట్ల నగదు ఇవ్వడానికి ఆర్‌బీఐ బోర్డు అంగీకరించింది. ఇది ఆర్‌బీఐ ఆస్తుల్లో 12.5 శాతం.

నిపుణులంతా కొంతకాలం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థకు గడ్డు రోజులు రాబోతున్నాయని హెచ్చరిస్తున్న నేపథ్యంలో మొన్న శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భిన్న రంగాలకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లపై బడ్జెట్‌లో ప్రకటించిన ఆదాయపన్ను సర్‌చార్జీ పెంపును ఉపసంహరించుకున్నారు. ఈ పెంపుతో దాదాపు రూ. 25,000 కోట్లు వెనక్కి తీసుకున్న విదేశీ మదుపుదార్లను తిరిగి ఆకర్షించడమే దీని ఆంతర్యం. ఇప్పుడు ఆర్‌బీఐ కూడా నగదు బదిలీకి అంగీకరించడంతో కేంద్రం పని సులభమైంది. 

గత రెండేళ్లుగా ఆర్థిక రంగం పనితీరుపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా– చైనాల మధ్య సాగుతున్న టారిఫ్‌ల యుద్ధం ముదిరితే ఇది మరింత క్షీణించడం ఖాయమని అందరిలోనూ గుబులుంది. మూడేళ్లుగా వృద్ధిరేటు క్షీణిస్తుండటం, ప్రైవేటు రంగంలో ఆశించినంత పెట్టుబడులు రాకపోవడం, ఉపాధి లేమి, వాహనాలు, ఇతర వినియోగ వస్తువుల అమ్మకాల్లో క్షీణత వంటివి మాంద్యానికి సూచనలు. ఆదాయపన్ను, జీఎస్‌టీల ద్వారా వచ్చే రెవెన్యూ అంచనా లకు తగినట్టు లేదు. ఈ పరిణామాలన్నిటినీ గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం అటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)కు రుణలభ్యతను అసాధ్యం చేస్తున్న ఆర్‌బీఐ ఆంక్షలను సడలించాలని, దాని దగ్గరుండే నగదు నిల్వల్లో కొంత భాగం తనకు దఖలు పడాలని కోరుకుంది. ఈ రెండింటి విషయంలోనూ ఉర్జిత్‌ పటేల్‌కూ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకూ మధ్య విభేదాలు తలెత్తాయి. 

ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చిన రుణాలను తిరిగి వసూలు చేసుకోవడంలో విఫలమవుతున్న బ్యాంకులు కొత్తగా రుణాలివ్వడం అసాధ్యమయ్యేలా ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. అది ఉత్పాదక తపైనా, ఉపాధి అవకాశాలపైనా ప్రభావం చూపడాన్ని గమనించిన కేంద్రం... ఆ ఆంక్షల్ని సడలిం చమని ఆర్‌బీఐని కోరింది. అందుకు ఆర్‌బీఐ బోర్డు నిరుడు అంగీకరించింది. ఇక నగదు నిల్వల బదిలీకి సంబంధించి మాత్రం ప్రతిష్టంభన ఏర్పడింది. ఆర్‌బీఐ దగ్గర తగినంతగా నగదు నిల్వలు న్నప్పుడే దాని సమర్థతపై మార్కెట్‌లో విశ్వసనీయత ఏర్పడుతుందని ఉర్జిత్‌ భావించారు. ఆ నిల్వలు గడ్డు పరిస్థితుల్లో వినియోగించడానికి తప్ప ప్రభుత్వానికి బదిలీ చేయడం కోసం కాదని ఆయన చెప్పడంతో సమస్య జటిలంగా మారింది. చివరకు ఈ వివాదం ఎక్కడివరకూ పోయిం దంటే...ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 7 ను ఉపయోగించి బ్యాంకు వ్యవహారాలను కేంద్రం తన పరిధి లోకి తెచ్చుకుంటుందన్న కథనాలు కూడా వెలువడ్డాయి. 

ఆర్‌బీఐకీ, కేంద్రానికీ మధ్య విభేదాలు తలెత్తడం కొత్తేమీ కాదు. గతంలో రిజర్వ్‌బ్యాంక్‌ గవ ర్నర్‌లుగా పనిచేసినవారు సైతం కేంద్రం ప్రతిపాదనలు తోసిపుచ్చటం, అప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రులు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. ఆర్‌బీఐ స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థేగానీ సర్వస్వతంత్రంగా ఉండటం సాధ్యం కాదు. అందువల్లే విభేదాలు తలెత్తినప్పుడల్లా పరస్పరం చర్చించుకోవడం, ఒక అంగీకారానికి రావడం రివాజు. అయితే ఆ చర్చ వాస్తవాల ప్రాతి పదికన ఉండాలి. గతంలో ఉర్జిత్‌ పటేల్‌తో కేంద్రం తరఫున గట్టిగా వాదించిన శక్తికాంత దాస్‌ ఇప్పుడు రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌గా వచ్చారు కాబట్టి పరిస్థితులు మారిపోయాయి. అయితే ఇప్పుడు బదిలీ అవుతున్న ఈ నిధులను వెచ్చించడంలో కేంద్రం ఆచితూచి అడుగులేయాల్సి ఉంటుంది. 

వృద్ధిరేటు ప్రస్తుతం అయిదేళ్ల కనిష్టంలో ఉంది. ఈ పరిస్థితుల్లో ద్రవ్యలోటును కట్టడి చేస్తూనే ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలివ్వడం తాడు మీద నడకలాంటిది. వాస్తవానికి ప్రైవేటు రంగానికి ఇప్పుడున్న సమస్య రుణలభ్యత కాదు. మార్కెట్‌లో డిమాండ్‌ పడిపోవడం వల్ల తమ ఉత్పత్తులకు గిరాకీ ఉంటుందో లేదోనన్న బెంగ వారిని పీడిస్తోంది. అందుకే అవి చొరవ చేసి ముందుకు రాలేక పోతున్నాయి. భిన్న రంగాలకు ప్రకటించిన ఉద్దీపనలు సహజంగానే ఆ రంగాలు పుంజుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే రూ. 70,000 కోట్లను బ్యాంకులకు మూలధన సాయంగా వెచ్చించా లని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఉపాధి అవకాశాలు పెరిగేందుకు అవసరమైన ఇత రేతర చర్యలు కూడా తీసుకోవాలి. ఆ చర్యలు ప్రజల్లో కొనుగోలు శక్తిని గణనీయంగా పెంచు తాయి. అప్పుడు మాత్రమే ఆర్థిక రంగం ఎంతో కొంత కుదుట పడుతుంది.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా