సారీ..!

8 Nov, 2019 02:49 IST|Sakshi

అంటోంది భూమి ఫెడ్నేకర్‌. ఎందుకు? మ్యారిటల్‌ రేప్‌ మీద వ్యంగ్యంగా కామెంట్‌ చేసినందుకు. అఫ్‌కోర్స్‌ స్క్రీన్‌ మీదే అనుకోండి.. అయినా స్త్రీవాదుల మనోభావాలు దెబ్బతిన్నాయి. భూమి ఫెడ్నేకర్, కార్తీక్‌ ఆర్యన్‌ నటించిన ‘పతీ పత్నీ ఔర్‌ వోహ్‌’ సినిమా ట్రైలర్‌కు సంబంధించిన విషయం ఇది. ఈ ట్రైలర్‌లో హీరో ఆర్యన్‌ కార్తీక్‌ పాత్ర ‘‘భర్త నానా తంటాలు పడి.. కిటుకులు, గిమ్మిక్కులతో కష్టపడి  భార్యను ‘ఒప్పిస్తే’ ఆ భర్తను రేపిస్ట్‌గా ముద్రేస్తారు’’ అని అంటాడు. ఈ డైలాగ్‌ వివాదమైంది. దాంతో భూమి ఫెడ్నేకర్‌ ‘‘మ్యారిటల్‌ రేప్‌ అనే సీరియస్‌ అంశాన్ని అపహాస్యం చేయాలని, వాళ్లను బాధపెట్టాలనే   ఉద్దేశం మాకెంతమాత్రం లేదు.

అయినా ఈ డైలాగ్‌ వల్ల కొంతమంది బాధపడ్డారు. క్షమించండి’’ అంటూ సారీ చెప్పింది. సమాజంలో మ్యారిటల్‌ రేప్‌ మీద చాలా సీరియస్‌గా చర్చ జరుగుతున్న నేపథ్యంలో పతీ పత్నీ ఔర్‌ వోహ్‌ లోని  హీరో పాత్ర చెప్పే డైలాగ్‌ నిజంగానే.. ఈ అంశం సీరియస్‌నెస్‌ను తగ్గించేదిగానే ఉంది. భార్య మనసు గెలుచుకోవాల్సింది కిటుకులు, పొగడ్తలతో కాదు.. ఇంటి బాధ్యతల్లో,  సహజీవన ప్రయాణంలో సమభాగస్వామిగా గౌరవం ఇచ్చి. ఇలా అర్థం వచ్చేలా సీన్స్‌ ఉంటే సారీ చెప్పాల్సిన అవసరమే ఉండదు కదా! అడుసు తొక్కనేలా? కాలు కడగనేలా? విషయాన్ని అపహాస్యం చేయనేలా? సారీ చెప్పనేల?

మరిన్ని వార్తలు