ఆది ధ్వనికి... ఆతిథ్యం

8 Nov, 2019 02:45 IST|Sakshi

 రేపటి నుంచే జానపద  వాయిద్య ప్రదర్శన

సాక్షి, హైదరాబాద్‌: ఆదివాసి నగరా, గోండుతుడుం, కోయ డోలు,బుర్ర వీణ,మట్టి ఢంకా,అదివాసి మద్దెల ఇంకా చెక్క చెమిడికలు.. ఇలా ఒకటా..రెండా ఏకంగా అరుదైన 124 గిరిజన సంగీత వాయిద్యాలన్నీ ఒకే చోట దర్శనమివ్వను న్నాయి. వందల ఏళ్ల గోండు గూడేలు,ఆదివాసి పల్లెలకు సంగీత ఆహ్లాదం పంచి క్రమంగా కనుమరుగవుతున్న వాయిద్యాలన్నీ 9వ తేదీ నుంచి  మాదాపూర్‌లోని స్టేట్‌ఆర్ట్‌ గ్యాలరీలో ప్రదర్శించనున్నారు. తెలంగాణ ఆది ధ్వని వేదిక ఆధ్వర్యంలో 13వ తేదీ వరకు సాగే ప్రదర్శనలో కనుమరుగైన అనేక సంగీత వాయిద్య పరికరాలను ప్రదర్శనగా ఉంచుతారు. పరికరాలతో ఆదివాసి కిన్నెర,బుర్రవీణ, రుంజ తదితర ఎనిమిది రకాల వాయిద్యాలను సైతం ప్రదర్శించే కళాకారులు ఈ వేదికపై పాలుపంచుకోనున్నారు. ఈ విషయమై నిర్వాహకులు ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమల రావు ‘సాక్షి’ తో మాట్లాడుతూ ఆదిలాబాద్,ఖమ్మం, బస్తర్‌ జిల్లాల్లో వినియోగించిన సంగీత పరికరాలన్నీ ప్రదర్శనలో ఉంచుతామని తెలిపారు. దేశంలో అతిపెద్ద గిరిజన సంగీత ప్రదర్శన దీన్ని పేర్కొనవచ్చని జయధీర్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు