కుంగుబాటుతో జ్ఞాపకశక్తి సమస్యలు

10 May, 2018 09:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూయార్క్‌ : డిప్రెషన్‌తో బాధపడే రోగులు క్రమంగా జ్ఞాపకశక్తి సమస్యలతో సతమతమవుతారని తాజా అథ్యయనం వెల్లడించింది. కుంగుబాటుకు గురైన వారి మెదడు త్వరగా వయసు మీరడంతో మెమరీ సమస్యలు చుట్టుముడతాయని మియామి యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. తీవ్ర కుంగుబాటుకు లోనైన వారికి చిన్న చిన్న విషయాలను గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమవుతుందని, వారి మెదడు కుచించుకుపోయి..వయసు మీరే ప్రక్రియ వేగవంతమవుతుందని తమ అథ్యయనంలో వెల్లడైందని చెప్పారు.

కుంగుబాటు అల్జీమర్స్‌ వంటి వ్యాధులకు దారితీయకముందే చికిత్స చేయించుకోవాలని పరిశోధకులు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కుంగుబాటు, అల్జీమర్స్‌ తీవ్రంగా పెరుగుతున్నాయని వీటికి కారణాలు, చికిత్సపై శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. అల్జీమర్స్‌తో బాధపడే రోగులు కుంగుబాటుతోనూ సతమతమవుతున్నట్టు తాజా అథ్యయనంలో వెల్లడైందని పరిశోధకులు పేర్కొన్నారు. కుంగుబాటుకు సత్వర చికిత్స తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి సమస్యలు, అల్జీమర్స్‌ ముప్పు నుంచి బయటపడవచ్చని సూచించారు. మెదడుపై డిప్రెషన్‌ పెను ప్రభావం చూపకముందే చికిత్సకు ఉపక్రమించాలని చెబుతున్నారు. కుంగుబాటుతో ఇబ్బందిపడుతున్న 1000 మందిపై మియామీ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అథ్యయనం నిర్వహించారు.
 

మరిన్ని వార్తలు