ఎర్ర సముద్రం

21 Sep, 2018 00:11 IST|Sakshi

చెట్టు నీడ

‘మూసా మమ్మల్ని తీసుకొచ్చి ఈ సముద్రం పక్కన నిలబెట్టావేమిటి? ఈజిప్టులోని ఖననవాటికలు సరిపోలేదా?’ అని అస్మదీయులు నిష్టూరంగా పలుకుతున్న ఆ ఘడియలో దైవ సహాయం అందింది!

నేటికి వేల సంవత్సరాల క్రితం ఇస్రాయీల్‌ అనే జాతి ప్రజలు శతాబ్దుల తరబడి ఈజిప్టులో కడు దుర్భరమైన, అవమానకరమయిన జీవితం గడపాల్సి వచ్చింది. ఫిరౌన్‌ అనే రాజు పీడనకు గురవ్వాల్సి వచ్చింది. ఫిరౌన్‌ తనకు తాను ‘నేనే దేవుడిని’ అని విర్రవీగేవాడు. తన రాజ్యంలోని అప్పుడే పుట్టిన మగబిడ్డల్ని చంపేసేవాడు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో దేవుడు వారి మధ్యన మహనీయ మూసా (అలైహిస్సలామ్‌)ను ప్రభవింపజేశాడు. అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్న ఆ కాలంలో సత్యాన్ని సమర్థించడానికి ఇస్రాయీల్‌ ప్రజలు మూసా (అలై)ను దేవుని ప్రవక్తగా అంగీకరించారు. ఆయన ద్వారానే ఆ జాతి వారు ఫిరౌనీయుల చెరనుండి విముక్తి పొందారు. ఇలా ఉండగా, ఒకానొక రాత్రివేళ రాజ్యంలోని అన్ని ప్రాంతాల నుండి ప్రజలు బయలుదేరి దైవప్రవక్త మూసా (అలైహిస్సలామ్‌)తో కలిసి వేరే ఎర్రసముద్రం వైపునకు సాగిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ పయన బృందం ఎర్రసముద్రం తీరానికి చేరుకుంటూ ఉన్న సమయంలోనే ఫిరౌన్‌ చక్రవర్తి ఒక భారీ సేనా వాహినిని తీసుకుని వాళ్లను వెంబడిస్తూ వచ్చాడు! ముందు నుయ్యి  వెనుక గొయ్యి అన్నట్లు తయారయ్యింది పరిస్థితి. మూసా ప్రవక్త అనుయాయులు ఫిరౌన్‌ సేనల చేతికి చిక్కుకుపోయేలానే ఉన్నారు. వెనుక శత్రు సేనలు, ముందేమో ఎర్ర సముద్రం. దిక్కుతోచని పరిస్థితి. ‘‘మూసా మమ్మల్ని తీసుకొచ్చి ఈ సముద్రం పక్కన నిలబెట్టావేమిటి? ఈజిప్టులోని ఖననవాటికలు సరిపోలేదా?’ అని అస్మదీయులు నిష్టూరంగా పలుకుతున్న ఆ ఘడియలో దైవ సహాయం అందింది. ‘‘మూసా నీ చేతికర్రతో సముద్రంపై కొట్టు’’ అని దైవాదేశమయింది.

అల్లాహ్‌ వాణిని అనుసరించి మూసా ప్రవక్త, సముద్రంపై తన చేతికర్రతో కొట్టాడు. అంతే! సముద్రం రెండు ముక్కలుగా చీలిపోయింది. వాటిలోని ప్రతి భాగం ఓ పర్వతంలా వుంది. ఆ రెండు నీటి గుట్టల మధ్యన ఒక సందు, నీరు ఏ మాత్రం లేని ఓ పొడి దారి ఏర్పడింది. ఆ దారి గుండా మూసా అనుయాయులు సాగిపోవడం గమనించిన ఫిరౌన్‌ తన సైనికులతో సహా వారిని వెంబడించాడు. మూసా అనుయాయులు సముద్రం దాటే సమయానికి ఫిరౌన్‌ సేనలు ఆ దారి మధ్యన ఉన్నాయి. దైవాదేశానుసారం అప్పటివరకు ప్రహరీ గోడల్లా నిశ్చలంగా నిలిచి ఉన్న ఆ రెండు నీటి భాగాలు పరస్పరం కలిసిపోయాయి. ఫిరౌన్‌ తన సేనల సమేతంగా సాగర గర్భంలో కలిసిపోయాడు. దైవప్రవక్త మూసా (అలై) ఇస్రాయీల్‌ సంతతి వారిని తీసుకుని సీనాయ్‌ ద్వీపకల్పంలో ప్రవేశించారు. ఈ విధంగా ప్రవక్త మూసా (అలై) ఇస్రాయీల్‌ జాతిని ఫిరౌన్‌ చెరనుంచి విడిపించారు. అందుకే ముస్లిములు ముహమ్మద్‌ ప్రవక్త (సఅసం) సంప్రదాయం ప్రకారం మొహర్రం నెల 10వ తేదీన యౌమే ఆషూరాగా జరుపుకుంటారు. ఆషూరా రోజున ఉపవాసం పాటిస్తారు. 
 –  ముహమ్మద్‌ ముజాహిద్‌
 

మరిన్ని వార్తలు