ప్రేమ ఎంత కఠినం!

6 Aug, 2014 22:57 IST|Sakshi
ప్రేమ ఎంత కఠినం!

కనువిప్పు
 
ఆ అమ్మాయితో మాట్లాడడానికి తప్ప చదువుకోవడానికి కాలేజికి వెళ్లేవాడిని కాదు. దాని ఫలితం పరీక్ష తప్పడం.
 
ప్రేమ ఎంత కఠినం... అనే మాటను మామూలుగానైతే ప్రేమలో భంగపడిన సందర్భంలోనో, విరహవేదనలో ఉన్నప్పుడో వాడుతుంటారు. కానీ, నేను మాత్రం ఆ నేపథ్యం నుంచి ‘ప్రేమ ఎంత కఠినం’ అనే మాటను వాడడం లేదు. ఎందుకు వాడానో తెలుసుకోవాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్‌లోకి...
 నేను మొదటి నుంచి చదువులో ముందుండే వాడిని.
 ‘‘అరే...వాడిని చూసి నేర్చుకోండిరా...స్టూడెంట్ అంటే అలా ఉండాలి’’ అని చదువులో వెనకబడిన విద్యార్థులను ఉద్దేశించి టీచర్లు నా గురించి చెప్పేవారు.
 ఇంటర్‌మీడియెట్‌లో చేరిన తరువాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారింది. నేను ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాను. నిజానికి అది ప్రేమ కాదు ఆకర్షణ అంటే సరిపోతుందేమో.
  ఆ అమ్మాయిని మెప్పించడం, ఆమెతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండడమే నా లోకం అయిపోయింది. చదువు కాస్తా వెనక్కి వెళ్లిపోయింది.
 ఆ అమ్మాయితో మాట్లాడడానికి తప్ప చదువుకోవడానికి కాలేజికి వెళ్లేవాడిని కాదు. దాని ఫలితం పరీక్ష తప్పడం. ఈ సమయంలోనే వాళ్ల నాన్నకు బదిలీ కావడంతో ఆ అమ్మాయి మహారాష్ట్రకు వెళ్లిపోయింది.
 ఒకవైపు పరీక్ష తప్పిన బాధ, మరోవైపు ఆ అమ్మాయి దూరమైన బాధ....నా మానసిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది. బరువు చాలా తగ్గిపోయాను. ఎప్పుడూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండేవాడిని.
 ‘‘నీకు ఎంత డబ్బు అంటే అంత ఇస్తాను. నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసుకో. సినిమాలకు వెళతావో, ఫ్రెండ్స్‌తో షికార్లకు వెళతావో నీ ఇష్టం. ఖాళీగా మాత్రం కూర్చోవద్దు. అనవసరంగా ఆలోచించవద్దు’’ అని చెప్పాడు నాన్న.
 బయటకు వెళ్లి సినిమాలైతే చూడలేదుగానీ, మా ఇంట్లో ఉన్న సిస్టమ్‌లో ఇరానీ సినిమాలు కొన్ని చూశాను. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సందేశం నా దరికి చేరేది.
 ‘‘నాకు కాళ్లు చేతులు మాత్రమే లేవు. ఆత్మవిశ్వాసం ఉంది’’ అని చెబుతుంది ఒక ఇరానీ సినిమాలో ఒక పాత్ర. ఇది నా మీద చాలా ప్రభావం చూపించింది.
 ‘‘నాకు కాళ్లూ చేతులు మాత్రం ఉన్నాయి. ఆత్మవిశ్వాసం లేదు’’ అనుకున్నాను.
 నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను. అటకెక్కిన పాఠ్యపుస్తకాలకు పని కల్పించాను. చదువు తప్ప వేరే లోకం లేదు...అన్నట్లుగా చదివాను. ఎక్కువ మార్కులతో పరీక్ష పాసయ్యాను. సివిల్స్ రాయలనేది నా భవిష్యత్ లక్ష్యం. ‘‘ఇప్పుడు నాకు కాళ్లు చేతులే కాదు...ఆత్మవిశ్వాసం కూడా ఉంది’’. నా భవిష్యత్ లక్ష్యాన్ని చేరుకుంటాననే నమ్మకం నాలో ఉంది.        

-ఆర్‌యస్వీ, రాజోలు
 

మరిన్ని వార్తలు