ఒక సిప్పెయ్యవయ్యా!

1 Apr, 2017 00:25 IST|Sakshi
ఒక సిప్పెయ్యవయ్యా!

 సూర్యభగవానయ్యా!!

‘తియ్యటి ఎండ’ అంటే... మీకు తిక్కరేగిపోతుందేమో! ‘చల్లటి ఎండ’ అంటే... మీకు ఒళ్లు మండిపోతుందేమో! ‘కమ్మటి ఎండ’ అంటే.. మీకు చిర్రెత్తుకొస్తుందేమో! అలా ఉన్నాయ్‌ మరి ఎండలు. మార్చిలోనే ఏప్రిల్‌ వచ్చింది! ఏప్రిల్‌లోనే... మే వచ్చేసింది! డోన్ట్‌ వర్రీ. సూర్యుణ్ణి సూర్యుడిలా చూడకండి. బెల్లం గుండ్రాయిలా చూడండి. బెల్లం షర్బత్‌లు సేవించండి. పైనున్న ప్రచండుడికీ... గ్లాసెత్తి ఓ సిప్‌ ఆఫర్‌ చెయ్యండి.

వెలక్కాయ బెల్లం షర్బత్‌
కావల్సినవి: వెలక్కాయ – 1 నీళ్లు – 2 గ్లాసులు బెల్లం తరుగు – 2 టీ స్పూన్లు జీలకర్ర పొడి – చిటికెడు పుదీన ఆకులు – పది
తయారీ:   కాయను పగలగొట్టి, లోపలి గుజ్జు తీసి గిన్నెలో వేసి, నీళ్లు పోసి కలపాలి. గింజలు తీసేయాలి. బెల్లం కలపాలి. బెల్లం పూర్తిగా కరిగాక జీలకర్రపొడి, ఐస్‌ క్యూబ్స్, పుదీన ఆకులు వేసి సర్వ్‌ చేయాలి.

పానకం
కావల్సినవి బెల్లం తరుగు – 4 టేబుల్‌ స్పూన్లు; నీళ్లు – 2 కప్పులు;యాలకుల పొడి – చిటికెడు ; శొంఠి – చిటికెడు ; మిరియాల పొడి – చిటికెడు
తయారీ:  నీళ్లలో బెల్లం వేసి కరిగేదాకా కలపాలి. జల్లితో వడకట్టాలి. దీంట్లో యాలకుల పొడి, శొంఠి, మిరియాల పొడి కలపాలి.
నోట్‌: చల్లగా కావాలనుకునేవారు ఐస్‌ వేసుకోవచ్చు. పుదీనా లేదా తులసి ఆకులను పానకంలో కలుపుకోవచ్చు. పానకంతోపాటు వడపప్పు తినొచ్చు.

సోంపు బెల్లం షర్బత్‌
కావల్సినవి: సోంపు – 2 టీ స్పూన్లు; బెల్లం తరుగు – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నల్లమిరియాల పొడి – చిటికెడు ; క్రష్డ్‌ ఐస్‌– తగినంత
తయారీ:  సోంపు గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే బెల్లం తరుగు వేసి సోంపును మెత్తగా రుబ్బాలి. దీంట్లో ఉప్పు, మిరియాల పొడి, నీళ్లు, జీలకర్రపొడి క్రష్‌ చేసిన ఐస్‌ వేసి మరోసారి బ్లెండ్‌ చే యాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి అందించాలి.

షికంజి
కావల్సినవి:చల్లటి నీళ్లు – 2 గ్లాసులు; బెల్లం తరుగు – 2 టీ స్పూన్లు; నిమ్మరసం – 2 టీ స్పూన్లు; నల్లుప్పు – పావు టీ స్పూన్‌; నల్ల మిరియాల పొడి – చిటికెడు; జీలకర్ర పొడి – పావు టీ స్పూన్‌;
తయారీ:  నీళ్లలో బెల్లం, నల్లుప్పు వేసి, కరిగేవరకు కలపాలి. తర్వాత వడకట్టాలి. దీంట్లో నిమ్మరసం, జీలకర్రపొడి వేసి కలిపి గ్లాసులో పోయాలి. ఐస్‌ క్యూబ్స్‌ వేసి చల్ల చల్లగా అందించాలి.

పుదీనా బెల్లం షర్బత్‌
కావల్సినవి: పుదీనా ఆకులు – కప్పు బెల్లం – తగినంత నల్లమిరియాల పొడి – చిటికెడు జీలకర్ర – చిటికెడు
తయారీఇవన్నీ కలిపి గ్రైండ్‌ చేయాలి. గ్లాసులో పై మిశ్రమం టీ స్పూన్‌ వేసి ఐస్‌ వాటర్‌ పోసి కలపాలి.

మామిడికాయ బెల్లం జ్యూస్‌
కావల్సినవి: మామిడికాయ – 1; బెల్లం తరుగు – 6 టేబుల్‌ స్పూన్లు; నల్లుప్పు – టీ స్పూన్‌; ఏలకుల పొడి – చిటికెడు; నీళ్లు – రెండు గ్లాసులు
తయారీ:  మామిడికాయను కడిగి, గ్లాసు నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. చల్లారాక మామిడి కాయను బాగా ఒత్తి గుజ్జు తీయాలి. దీంట్లో మరో గ్లాసు నీళ్లు కలిపి, ఉప్పు, బెల్లం వేసి బాగా కలపాలి. బెల్లం పూర్తిగా కరిగాక ఈ రసాన్ని వడకట్టాలి. దీంట్లో యాలకుల పొడి, ఐస్‌క్యూబ్స్‌ వేసి చల్ల చల్లగా సేవించాలి.

మరిన్ని వార్తలు