కాలం సాక్షిగా చెప్పే సత్యం

14 Apr, 2019 03:34 IST|Sakshi

ఇస్లామ్‌ వెలుగు

మానవ జీవితం చాలా అమూల్యమైనది. అది ఎప్పుడు అంతమవుతుందో ఎవరికీ తెలియదు. అల్లాహ్‌ దాన్ని రహస్యంగా ఉంచాడు. దాన్ని ఛేదించే శక్తిని ఎవ్వరికీ ప్రసాదించలేదు. కనుక జీవితకాలాన్ని సద్వినియోగం చేసుకోవడం పైనే సాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రపంచంలో మనం ఏదైనా సాధించవచ్చు. డబ్బు, గౌరవం, ఉద్యోగం, అధికారం, హోదా ఏదైనా కావచ్చు, అది సాధ్యమే. కాని కాలాన్ని మాత్రం ఎంత ధనం ధారపోసినా, ఎంతపలుకుబడి ఉపయోగించినా సాధించలేము. గడిచినకాలం – అది రెప్పపాటైనా సరే – కోట్లు కుమ్మరించినా మనకు లభించదు. ఇది కాలం చెప్పే సత్యం. మనం దాని విలువను గుర్తించకపోతే అది మనకోసం ఆగదు. గోడకు అమర్చినగడియారం ముల్లు ‘టిక్‌ టిక్‌’ మని శబ్దం చేస్తూ తన పని అది చేస్తూనే ఉంటుంది. సమయాన్ని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోగలిగినప్పుడే అది మనకు ఉపకరిస్తుంది.

లేకపోతే అది మనల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసి ముందుకు సాగిపోతుంది. అందుకని మనం ఏవిషయంలో అయినా సకాలంలో స్పందించగలగాలి. సమయం మించి పోయిన తరువాత తీరిగ్గా విచారిస్తే ప్రయోజనం ఉండదు. అవకాశాలు ఎప్పుడూ మనకోసం నిరీక్షిస్తూ ఉండవు. అవకాశాలను మనమే సృష్టించుకోవాలి.మనమే వాటిని అందిపుచ్చుకోవాలి. అవి మనవద్దకు రావాలని ఆశించడం కరెక్ట్‌ కాదు. ఎప్పుడు ఏది అవసరమో దానిపై దృష్టి కేంద్రీకరించాలి. బాధ్యతల నిర్వహణలో అలసత్వాన్ని ఎంతమాత్రం దరిచేరనీయకూడదు.ఎందుకంటే, ఈరోజు చేయవలసిన కార్యాన్ని రేపటికి వాయిదా వేశామంటే కాలం విలువను మనం గుర్తించనట్లే లెక్క. ఈనాటి కొద్దిపాటి అలక్ష్యం రేపటి బాధ్యతను రెట్టింపుచేస్తుంది. ఒకటికి రెండు తోడై, బాధ్యతలు పేరుకు పోతాయి. ఇక ఆతరువాత బాధ్యతల నిర్వహణ తలకుమించినభారంగా పరిణమించి, పలాయనవాదాన్ని ఆశ్రయించే దుస్థితికి తీసుకువస్తుంది.

అద్భుతమైన విజయాలను సాధించినవారి జీవితాలను పరిశీలిస్తే, వారు కాలాన్ని(సమయాన్ని) ఎలా తమకు అనుకూలంగా మలచుకొని, సద్వినియోగం చేసుకొని, కొత్త అవకాశాలను సృష్టించుకున్నారో, కొంగ్రొత్త ఆవిష్కరణలకు ఎలా నాంది పలికారో మనకు అర్ధమవుతుంది.ప్రఖ్యాత శాస్త్రవేత్త థామస్‌ అల్వా ఎడిసన్‌ తన జీవితకాలంలో వెయ్యికంటే ఎక్కువ నూతన ఆవిష్కరణలకు నాంది పలికాడు. వాటిలో గ్రామ్‌ ఫోన్, విద్యుత్తుబల్బు అతని ఆవిష్కరణలే అని మనందరికీ తెలుసు. ఇది ఎలాసాధ్యమైంది? అతను కాలం నాడిని ఒడిసిపట్టి, దాన్నిసద్వినియోగం చేసుకున్నాడు.

కాలక్షేపం కోసం కాలాన్ని దుర్వినియోగంచేయలేదు.సరదాలు, సొల్లుకబుర్లకోసం సమయాన్ని నిర్లక్ష్యం చేయలేదు. అతను, తనప్రయోగశాలనే వినోదశాలగా మార్చుకున్నాడు. చేస్తున్న పనిలోనే ఆనందాన్ని, వినోదాన్ని అనుభవించాడు. కాలం విలువను గుర్తించబట్టే, విద్యుత్‌ బల్బును కనుగొనే సమయంలో ఏకధాటిగా పన్నెండు, పదమూడు రోజులు ప్రయోగశాలలోనే నిద్రలేని రాత్రులు గడిపాడు.అందుకని కాలం విలువను, ప్రాధాన్యతను గుర్తించాలి. పవిత్రఖురాన్‌ కూడా ‘కాలం సాక్షిగా’ మానవాళికి అనేక హితబోధలు చేసింది. కాలగతిలో కలిసిపోయిన వారి గాథల్ని గుణపాఠాలుగా వివరించింది. బుద్ధిజీవి అయిన మానవుడు ఈ హితోపదేశాలకనుగుణంగా నడచుకొని ఇహ పర లోకాల్లో సాఫల్యం పొందాలని ఆశిద్దాం.
ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు