పైపై పూతలు మనుషులకే!

5 Sep, 2019 08:57 IST|Sakshi

చెట్టు నీడ

ఒకసారి యేసుక్రీస్తు యెరికో పట్టణం గుండా వెళుతున్నాడు. అప్పుడు పన్ను వసూలు చేసే అధికారి జక్కయ్య అనే వ్యక్తి యేసు గురించి అప్పటికే ఎంతో గొప్పగా విని ఉండటం చేత యేసు ఎవరో చూడాలనుకున్నాడు. అతడు ధనవంతుడు. కాని పొట్టివాడు కావడంతో యేసును చూడాలనుకొని ఆయన చుట్టూ చేరిన జనసందోహంలోకి చొచ్చుకుని పోయి యేసును చూడలేకపోయాడు. దాంతో అతను ఒక మేడి చెట్టు ఎక్కి యేసును తదేకంగా చూడసాగాడు. అతని అంతరంగాన్ని, తన పట్ల అతనికి గల ప్రేమాభిమానాలను గుర్తించిన యేసుక్రీస్తు అతనితో – జక్కయ్యా త్వరగా చెట్టు దిగి రమ్ము, ఈ రోజు నేను నీ గృహంలో విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానన్నాడు. అందుకతడు సంతోషించి, యేసును అతని ఇంటికి ఆహ్వానించాడు.

అందరూ అది చూసి ‘ఇదేం విడ్డూరం! ఈయన పాపిౖయెన మనుష్యుని ఇంట బస చేయడానికి వెళ్లాడు’ అని గుస గుసలాడుకోసాగారు. యేసును చూసిన ఆనందంతో జక్కయ్య – ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకిచ్చేస్తాను. నేను ఎవరి వద్దనైతే అన్యాయంగా దేనినైనను సంపాదించిన యెడల అంతకు నాలుగు వంతులు అదనంగా ఇస్తానని ఆయన పాదాల నంటి వాగ్దానం చేశాడు. అందుకు యేసు – జక్కయ్యా! నీవు కూడా అబ్రహాము కుమారుడవే, నేడు ఈ ఇంటికి ‘రక్షణ’ వచ్చింది, పాడైపోయిన వ్యవస్థను చూచి, రక్షించుటకే మనుష్య కుమారుడు వచ్చాడని చెప్పాడు (లూకా 19:1–10). మనుషుల అంతరంగాన్ని ఎరిగినందుననే పాపిగా మనుష్యులు సణుగుకొన్న జక్కయ్య ఇంటికి వెళ్లాడు యేసుక్రీస్తు. పాపిగా ఎంచబడ్డ గోడను అడ్డు తొలగించి రక్షణ కలిగించాడు. ఈ తేడాలు, మనుష్యులకే కాని దేవుని దృష్టిలో అందరూ సమానులేనని చెప్పకనే చెప్పాడు. పై పై రూపాలు, పైపై పూతలను చూసి మోసపోయేది మనుషులే కాని, దేవుడు కాదు కదా... యెహోవా హృదయమును లక్ష్యపెట్టాడు. అందుచేత హృదయములోని తలంపు యెరిగి జక్కయ్య వద్దకు యేసుక్రీస్తు వెళ్లాడు (1 సమూ 16:7).– బి.బి.చంద్రపాల్‌ కోట

మరిన్ని వార్తలు