Sakshi News home page

ఆటోడ్రైవర్‌ మృతి ఘటన: చెట్టు కూలడానికి అధికారుల నిర్లక్షమే కారణమా?

Published Mon, Sep 4 2023 7:45 AM

negligence authorities hyderguda huge tree fell - Sakshi

అధికారుల నిర్లక్ష్యం... పాలకుల అలసత్వం ఓ అమాయకుడి ప్రాణాలు పోయేందుకు కారణమైంది. ఎంతో మందికి నీడనిచ్చే భారీ వృక్షానికి జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం చుక్క నీరు పీల్చే అవకాశం ఇవ్వకుండా మొదళ్లల్లో కాంక్రీట్‌తో కప్పేశారు. మరో పక్క బిల్డింగ్‌ యజమాని బిల్డింగ్‌ మరమ్మతుల సమయంలో ఈ భారీ వృక్షాన్ని కూల్చేందుకు విశ్వప్రయత్నాలు చేసిన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. బిల్డింగ్‌ యజమాని, జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం, హార్టికల్చర్‌ల నిర్లక్ష్యమే భారీ వృక్షం కుప్పకూలడానికి.. ఆటోడ్రైవర్‌ మహ్మద్‌ గౌస్‌ మరణానికి కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

హైదరాబాద్: హైదర్‌గూడ సిగ్నల్‌ వద్ద శనివారం భారీ వృక్షం కూలడంతో ఒక్కసారిగా వాహనదారులు, స్థానికులు ఆందోళన చెందారు. చెట్టు కూలిన ప్రాంతంలో ఉన్న బిల్డింగ్‌ మూడేళ్ల క్రితం మరమ్మతులు చేశారు. అప్పట్లోనే ఈ చెట్టును ఇక్కడ నుంచి తరలించేందుకు కాంట్రాక్టర్‌ స్థానిక రాజకీయ నేతలతో కలసి విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. గత ఏడాది ఫుట్‌పాత్‌ నిర్మాణాల్లో భాగంగా సర్కిల్‌–16కు సంబంధించిన ఇంజినీరింగ్‌ విభాగం హిమాయత్‌నగర్‌ వైజంక్షన్‌ నుంచి హైదర్‌గూడ చెట్టు కూలిన ప్రాంతం వరకు ఫుట్‌పాత్‌లను నిర్మించారు.

కాసులకు కక్కుర్తి పడ్డ జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం బిల్డింగ్‌ యజమానుల మాటలు విని చెట్టు మొదళ్లల్లో మొత్తం కాంక్రీట్‌ వేసి పూడ్చేశారు. ఒక్క చుక్క నీరు చెట్టు వేర్లుకు తగలకుండా చేశారు. దీనికారణంగా ఏడాదికి పైగా ఒక్క బొట్టు నీటిని పీల్చుకోని ఆ చెట్టు శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఇదే కోవలో మరిన్ని చెట్లు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయనడం ఏమాత్రం సందేహం లేదు. శనివారం కూలిన చెట్టుపక్కనే మరో చెట్టును కూడా కాంక్రీట్‌తో కూల్చేయడం జరిగింది. దీనితో పాటు మరికొన్ని చెట్లు ఇదేతరహాలో ఉన్నాయి. 

మొద్దునిద్రలో హార్టికల్చర్‌ విభాగం... 
చెట్లను సంరక్షించాల్సిన హారి్టకల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. బిల్డింగ్‌ నిర్మాణాలకు భారీ వృక్షాలు అడ్డు వస్తున్న తరుణంలో కాంట్రాక్టర్లు ఇచ్చే డబ్బుకు దాసోహం అవుతున్న హారి్టకల్చర్‌ ఆయా ప్రాంతాల్లోని చెట్లను కూల్చేస్తున్నారు. సీసీ ఫుటేజీలకు చెట్ల కొమ్మలు అడ్డొస్తున్నాయి. ట్రాఫిక్‌కు విఘాతం కలిగే వాటిని తొలగించాలంటూ పలుమార్లు నారాయణగూడ ట్రాఫిక్‌ పోలీసులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పట్టించుకునే నాథుడు హారి్టకల్చర్‌ శాఖలో లేకపోవడం గమనార్హం. 

Advertisement

What’s your opinion

Advertisement