మొక్కను ఆదర్శంగా తీసుకుందాం

8 Jun, 2017 23:10 IST|Sakshi
మొక్కను ఆదర్శంగా తీసుకుందాం

ఆత్మీయం

అవాంతరాలు, అడ్డంకులు ఎదురు కాని మనిషి ఉండడు. ఆ మాటకొస్తే ఇబ్బందులు ఎదుర్కొనని జీవే ఉండదు. విత్తనం ఒక జీవమున్న పదార్థం అనుకుందాం. మర్రి విత్తనం ఎంతో చిన్నది. అది మొలకెత్తి ఎన్నో ఊడలున్న పెద్ద చెట్టుగా మారుతుందని మనకు తెలుసు. అయితే అది అంత తేలికగా ఏమీ జరగడం లేదు. విత్తనం చెట్టుగా మారేలోగా ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు... మొదట విత్తనం మట్టిలో పడగానే చీమలు, చిన్న పురుగుల వంటివి దానిని తినేయాలని చూస్తాయి. అది వాటిని తప్పించుకుని మొలకెత్తుతూ ఉంటుంది. ఈలోగా పక్షులు దాన్ని పసిగట్టి పొడుస్తూ తినేసేందుకు ప్రయత్నిస్తాయి.

వాటి బారిన పడకుండా అది ఆకులూ మారాకులూ వేస్తూ పెరుగుతూ ఉంటే, పశువులు దానిని ఫలహారం చేయబోతాయి. అయినా సరే, అది ఎదిగి కొమ్మలూ రెమ్మలూ వేస్తుంది... క్రమంగా ఊడలు పాతుకునిæ... భూమిలో బలంగా వేళ్లూనుకుంటుంది. చాలా చిత్రంగా అది చిన్న విత్తుగా భూమిలో ఉన్నప్పుడు దాని ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న జీవులన్నీ దాని నీడలోనే తలదాచుకుంటాయి. దాని మీద గూళ్లు కట్టుకుంటాయి. మనిషి ఎదుగుదల కూడా అటువంటిదే. అంత చిన్న విత్తనమే అన్ని అవరోధాలనుంచి తప్పించుకుని మొక్కగా పెరిగి మానుగా ఎదుగుతోందంటే... మనిషెలా ఉండాలి? అందుకే చిన్న చిన్న అడ్డంకులతో మన ఎదుగుదల ఆగిపోయిందని బాధపడకుండా మరింతగా పెరిగేందుకు ప్రయత్నించాలి.

మరిన్ని వార్తలు