ఇదేమి ‘ఫసల్‌’?! | Sakshi
Sakshi News home page

ఇదేమి ‘ఫసల్‌’?!

Published Thu, Jun 8 2017 11:09 PM

ఇదేమి ‘ఫసల్‌’?! - Sakshi

– ఫసల్‌ బీమాతో రైతుకు ధీమా కల్పించలేని ప్రభుత్వాలు
– వరికి స్థానం లేకున్నా గ్రామం యూనిట్‌గా బీమా
– గత ఖరీఫ్, రబీ పంటలకు విడుదల కాని పరిహారం


అనంతపురం అగ్రికల్చర్‌ : ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనా (పీఎం ఎఫ్‌బీవై) రైతులకు ఉపయోగపడే సూచనలు లేవు! గత ఖరీఫ్‌లో జిల్లాలో ఏడు పంటలకు ఈ పథకం వర్తింపజేసినా నేటికీ ఒక్క రూపాయి పరిహారం విడుదల కాకపోవడమే ఇందుకు నిదర్శనం. జిల్లా వ్యాప్తంగా ఈ పథకం కింద 8 వేల మందికి పైగా రైతులు రూ.34 లక్షలను ప్రీమియం రూపంలో చెల్లించారు. వర్షాలు లేక  80 శాతానికి పైగా పంట నష్టం జరిగినట్లు అధికారిక నివేదకలు స్పష్టం చేస్తున్నాయి. రూ.37 కోట్ల వరకు పరిహారం రావచ్చని అనధికారికంగా అంచనా కూడా వేశారు. అలాగే రబీలో కూడా వరి, జొన్న, పప్పుసెనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలకు ఫసల్‌బీమా వర్తింపజేశారు. రైతు వాటాగా ఖరీఫ్‌లో 2 శాతం, రబీ పంటలకైతే 1.5 శాతం చొప్పున వేలాది మంది పప్పుసెనగ రైతులు బీమా ప్రీమియం చెల్లించారు.

పంట దారుణంగా దెబ్బతినడంతో రూ.100 కోట్లకు పైగా పరిహారం వస్తుందని రైతులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ పథకం అమలు చేసిన వ్యవసాయ బీమా కంపెనీ పరిహారం విడుదలపై నోరు మెదపడం లేదు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయశాఖ అధికారులు కూడా మిన్నకుండిపోవడంతో రైతులకు అందాల్సిన బీమా పరిహారంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పంటల బీమా పథకాలపై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించడంలో జిల్లా యంత్రాంగం, వ్యవసాయశాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. మంత్రులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంతో రైతులు మరో సారి నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ సారి వరికి గ్రామం యూనిట్‌
ఇక ఖరీఫ్‌ 2017కు సంబంధించి వరితో పాటు కంది, జొన్న, మొక్కజొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, ఎండుమిరప, ప్రత్తి పంటలకు ఫసల్‌బీమా వర్తింపజేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల వరి పంటకు కాలం చెల్లిపోయింది. వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటిపోవడంతో వరి సాగుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. హెచ్చెల్సీ, హంద్రీ–నీవా ఆయకట్టు కింద కూడా వరి సాగు వద్దంటున్నారు. దీంతో ఏటా ఖరీఫ్‌లో వరి పంట సాధారణ సాగు 26 వేల హెక్టార్లుగా పరిగణించినా గత రెండు మూడు సంవత్సరాలుగా సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతూ వచ్చింది. ప్రస్తుతం పది నుంచి 15 మండలాల్లో 15 వేల హెక్టార్లకు మించి సాగులోకి రావడం గగనంగా మారింది. ఇలాంటి వరి పంటకు ఫసల్‌బీమాలో స్థానం కల్పిస్తూ గ్రామం యూనిట్‌గా బీమా పథకం అమలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేరుశనగ, కంది, పప్పుసెనగ లాంటి పంటలకు ఫసల్‌బీమా కింద గ్రామం యూనిట్‌గా తీసుకుంటే కొంత మేర ప్రయోజనం ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వేరుశనగకు ఫసల్‌బీమా డిమాండ్‌
లక్షల ఎకరాల్లో సాగవుతున్న వేరుశనగకు ఫసల్‌బీమా వర్తింపజేయాలన్న విపక్షాలు, రైతులు, రైతు సంఘాల డిమాండ్‌ను ప్రభుత్వాలు పక్కన పెట్టేశాయి. వాతావరణ బీమా కింద వేరుశనగ పంటకు హెక్టారుకు రూ.40 వేలు బీమా పరిహారం వర్తింపజేస్తూ 2 శాతం రైతు వాటాగా ప్రీమియంను జూలై 15వ తేదీలోగా చెల్లించాలని గడువు (కటాప్‌ డేట్‌) విధించారు. ఈ బాధ్యతను హెచ్‌డీఎఫ్‌సీ–ఈఆర్‌జీవో జీఐసీ లిమిటెడ్‌ సంస్థకు అప్పగించారు.

పరిహారం చెల్లింపులు ఇలా..
ఫసల్‌బీమా కింద వరి హెక్టారుకు బీమా పరిహారం రూ.40 వేలు, జొన్నకు రూ.25 వేలు, సజ్జకు రూ.18,750, మొక్కజొన్నకు రూ.35 వేలు, పొద్దుతిరుగుడుకు రూ.35 వేలు, ఎండుమిరపకు రూ.1,12,500, పత్తికి రూ.40 వేలుగా పరిహారం వర్తింపజేశారు. ఇందులో ఎండుమిరప, ప్రత్తి పంటలకు రైతు 5 శాతం వాటా ప్రీమియం, మిగతా పంటలకు 2 శాతం ప్రీమియం చెల్లించాల్సివుంటుంది. ఫసల్‌బీమా పథకాన్ని జాతీయ వ్యవసాయ బీమా కంపెనీ అమలు చేయనుంది. ఫసల్‌బీమా పథకాలకు ప్రీమియం గడువు వరికి మాత్రం ఆగస్టు 21వ తేదీ వరకు ఉండగా మిగతా ఏడు పంటలకు జూలై 31వ తేదీ గడువు పెట్టారు. చీనీకి తోటలు హెక్టారుకు రూ.75 వేలు పరిహారం వర్తింపజేయగా ఆగస్టు 9వ తేదీలోగా రైతు వాటాగా 5 శాతం ప్రీమియం చెల్లించాలని గడువు విధించారు.

Advertisement
Advertisement