ఒకే ముఖ్య  మహిళ

14 Dec, 2018 01:19 IST|Sakshi

ఇరవై తొమ్మిది రాష్ట్రాలు! పద్నాలుగు మంది ముఖ్య మహిళలు ఉండాలి.ఇది ‘ఆకాశంలో సగం’ కౌంట్‌.పోనీ...తొమ్మిది మంది ముఖ్య మహిళలు ఉండాలి. ఇది పార్లమెంట్‌లో ఇంకా నోచుకోని కౌంట్‌.కానీ ప్రస్తుతం మిగిలింది..ఒకే ఒక్క ముఖ్య మహిళ. ఇది ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాతి కౌంట్‌.అవును. మమతాబెనర్జీ ఒక్కరే ఇప్పుడు  మనకు మిగిలిన మహిళా ముఖ్యమంత్రి!

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో ఇప్పుడు మమతాబెనర్జీ ఒక్కరే ఏకైక మహిళా సి.ఎం.గా మిగిలారు! దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలలో మూడు రోజుల క్రితం వరకు ఇద్దరు మహిళా సి.ఎం.లు ఉండేవారు. రాజస్తాన్‌కు వసుంధరారాజే. పశ్చిమబెంగాల్‌కు మమతాబెనర్జీ. ఈ ఎన్నికల్లో రాజే పార్టీ బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో మరోసారి ఆమె సి.ఎం. కాలేకపోయారు. ఇక మిగిలింది మమతాబెనర్జీ. మమత 2011 నుంచి సి.ఎం.గా ఉన్నారు. పశ్చిమబెంగాల్‌లో గత అసెంబ్లీ ఎన్నికలు 2016లో జరిగాయి కనుక మమత 2021 వరకు సి.ఎం.గా ఉంటారు. రెండేళ్లకు ముందు నలుగురు మహిళా సి.ఎం.లు ఉండేవారు. మమత, రాజే, మొహబూబా ముఫ్తీ (జమ్మూకశ్మీర్‌), ఆనందిబెన్‌ (గుజరాత్‌). 2014లో మోదీ ప్రధాని కావడంతో గుజరాత్‌ సి.ఎం. పోస్టు ఖాళీ అయి, ఆ స్థానంలోకి ముఖ్యమంత్రిగా వచ్చిన ఆనందిబెన్, 2016లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు.

‘ఈ ఏడాదితో నాకు డెబ్బై ఐదేళ్లు వస్తున్నాయి. ఇక ఈ వయసులో నేను చురుగ్గా పనిచేయలేను కనుక రాజీనామా చేస్తున్నాను’ అని ఆనందిబెన్‌ బహిరంగంగానే ప్రకటించారు. ప్రస్తుతం ఆమె మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా ఉన్నారు. ఈ ఏడాది జనవరి 23న ఆనందిబెన్‌ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. నిన్నటి వరకు మధ్యప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న బీజేపీ నాయకుడు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్థానంలోకి కాంగ్రెస్‌ నాయకుడు కమల్‌నాథ్‌ వస్తున్నారు కాబట్టి ఆయన్ని కట్టడి చెయ్యడానికి మరింత క్రియాశీలంగా ఉండే గవర్నర్‌ను ఆ రాష్ట్రానికి నియమించాలని కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ అనుకుంటే కనుక ఆనందిబెన్‌ స్థానంలోకి మరొకరు రావచ్చు.ఆనందిబెన్‌ తనకు తానుగా గుజరాత్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటే, జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ ఈ ఏడాది జూన్‌లో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకోవడంతో తన పదవికి రాజీనామా చేశారు.

ప్రస్తుతం అక్కడ గవర్నర్‌ పాలన కొనసాగుతోంది. మెహబూబా ముఫ్తీ దేశంలో రెండవ ముస్లిం మహిళా సి.ఎం. కాగా, 1980–81 మధ్య అస్సాంలో అధికారంలో ఉన్న సయేదా అన్వరా తైమూర్‌.. తొలి ముస్లిం మహిళా ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు. వసుంధరా రాజే, మెహబూబా, ఆనందిబెన్‌లకు ముందు ఉమాభారతి (మధ్యప్రదేశ్‌), షీలాదీక్షిత్‌ (ఢిల్లీ), సుష్మా స్వరాజ్‌ (ఢిల్లీ), రబ్రీదేవి (బిహార్‌), రాజేందర్‌ కౌల్‌ భత్తల్‌ (పంజాబ్‌), మాయావతి (ఉత్తర ప్రదేశ్‌); వీరికి ముందు జయలలిత (తమిళనాడు), జానకీ రామచంద్రన్‌ (తమిళనాడు), సయేదా అన్వరా తైమూర్‌ (అస్సాం), శశికళా కకోద్కర్‌ (గోవా), నందిని సత్పతి (ఒరిస్సా), సుచేతా కృపలానీ (ఉత్తర ప్రదేశ్‌) ముఖ్యమంత్రులుగా ఉన్నారు.

ప్రస్తుతం ఉన్న మమతా బెనర్జీతో కలుపుకుని మొత్తం 16 మంది మహిళలు స్వతంత్ర భారతదేశంలో ముఖ్యమంత్రులు అయ్యారు.  ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇప్పటి వరకు 13 రాష్ట్రాలకు (ఉత్తర ప్రదేశ్, ఒరిస్సా, గోవా, అస్సాం, తమిళనాడు, పంజాబ్, బిహార్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, జమ్మూకశ్మీర్‌) మహిళలు ముఖ్యమంత్రులుగా పనిచేసిన రికార్డు ఉండగా.. తక్కిన 16 రాష్ట్రాలకు ఇంకా ఆ ఘనత దక్కవలసి ఉంది. పై పదమూడు రాష్ట్రాలలో మళ్లీ.. ఢిల్లీ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఆ రాష్ట్రాలు ఇద్దరు మహిళా సి.ఎం.లను చూశాయి. ఢిల్లీకి సుష్మా స్వరాజ్, షీలాదీక్షిత్‌; తమిళనాడుకు జానకీ రామచంద్రన్, జయలలిత, ఉత్తర ప్రదేశ్‌కు సుచేతా కృపలానీ, మాయావతి ముఖ్యమంత్రులుగా ఉన్నారు.

 దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్బయ్‌ ఏళ్లు దాటినా రాజకీయాలలో మహిళలకు ప్రాధాన్యం లేదని చెప్పలేం కానీ, తగినంత ప్రాధాన్యం లేదని మాత్రం సంఖ్యలు, శాతాలు చెబుతున్నాయి. దేశంలో ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల్లో ఇంకా సగం పైగానే ఏనాడూ మహిళా ముఖ్యమంత్రుల పాలనలో లేవు. పార్లమెంట్‌ సభ్యత్వంలో కూడా మహిళల సంఖ్య తక్కువగానే ఉంది. ప్రస్తుతం నడుస్తున్నది 16వ లోక్‌సభ. అది కూడా ముగింపునకు వచ్చేసింది. మొత్తం 543 లోక్‌సభ ఎంపీలలో (ఇద్దరు నామినేటెడ్‌ సభ్యుల్ని మినహాయిస్తే) 65 మంది మాత్రమే మహిళా ఎంపీలు ఉన్నారు. అంటే కేవలం 12 శాతం! రాజ్యసభలో 244 మంది సభ్యులుంటే వారిలో మహిళా ఎంపీలు 24 మందే. అంటే 11.5 శాతం. వచ్చే ఎన్నికల్లో ఈ శాతం పెరగడంతో పాటు, ఇప్పటికింకా మహిళా ముఖ్యమంత్రుల పాలన లోకి రాని రాష్ట్రాలు మహిళను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే అది రికార్డే అవుతుంది. రికార్డు మాట అటుంచి రాజకీయాల్లో మెరుగైన పరిణామాలు సంభవించే అవకాశం ఉంటుంది.

మహిళా సి.ఎం.లు
భారతదేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపలానీ మొదట స్వాతంత్య్ర సంగ్రామ యోధురాలు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు 1947 ఆగస్టు 14న నెహ్రూ ‘ట్రిస్ట్‌ విత్‌ డెస్టీనీ’ ప్రసంగానికి కొన్ని నిముషాల ముందు వందే మాతర గీతాన్ని కృపలానీనే ఆలపించారు. నందిని సత్పతి ఎం.ఎ చదివారు. కాలేజ్‌లో కమ్యూనిస్టు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి, కాంగ్రెస్‌ నుంచి బయటికి వెళ్లి, రాజీవ్‌ గాంధీ కోరడంతో తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారు. అంతకు ముందు ఇందిరాగాంధీ మంత్రివర్గ సభ్యురాలిగా ఉన్నారు.  శశికళా కకోద్కర్‌ని ‘తాయి’ అనేవారు. అంటే పెద్దక్క అని. పీజీ చేశాక శశికళ సామాజిక సేవలో ఉండిపోయారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు.మహారాష్ట్రవాది గోమంతక్‌ పార్టీలో ముఖ్య నాయకురాలు. సయేదా అన్వారా తైమూర్‌ అలిఘర్‌ ముస్లిం యూనివర్సిటీలో చదివారు. జొర్హత్‌లోని దేవీచరణ్‌ బారువా గర్ల్స్‌ కాలేజీలో ఎకనమిక్స్‌ లెక్చరర్‌గా పనిచేశారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 

 జానకి.. ఎం.జి.రామచంద్రన్‌ భార్య. ఎం.జి.ఆర్‌. చనిపోయాక పార్టీలోని ఒక వర్గం జానకిని సి.ఎం.గా ఉండమని కోరింది. అయితే 24 రోజులు మాత్రమే ఆమె ఆ పదవిలో ఉండగలిగారు. తర్వాత రాష్ట్రపతి పాలన వచ్చింది. ఇక జయలలిత.. చనిపోయే నాటికి తమిళనాడు సి.ఎం.గా ఉన్నారు. ముఖ్యమంత్రులుగా పని చేసిన మహిళల్లో మిగతావారైన మాయావతి, రబ్రీదేవి, సుష్మాస్వరాజ్, షీలాదీక్షిత్, ఉమాభారతి, వసుంధరా రాజే, మెహబూబా మఫ్తీ నేటికింకా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం తన 74వ వయసులో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న  రాజీందర్‌ కౌర్‌ భత్తాల్‌ నాటికీ, నేటికీ పంజాబ్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రే. ఆమె తర్వాత ఇంకో మహిళ ఆ స్థానంలోకి రాలేదు.  

మరిన్ని వార్తలు