అదిరిందయ్యా సుబ్బయ్యా

14 Dec, 2017 00:02 IST|Sakshi

  సెటైరమ్మా.. సెటైరూ..!

ఈమధ్య బయట తినేవాళ్లు బాగా ఎక్కువయ్యారు. తినేవాళ్లు ఎక్కువయ్యారు కానీ, తినే ఫుడ్డు ఎక్కువవుతుందా? పిడికెడంతే కదా మనిషి పొట్ట! మరి రెస్టారెంట్‌లు పొట్ట పోసుకునేదెలా? ఎలాగంటే.. ఫుడ్‌ ఐటమ్స్‌ రేట్లు పెంచాలి. పెంచొచ్చు కానీ,  మాటిమాటికీ గ్యాస్‌ రేటు పెరిగినట్లు, పెట్రోల్‌ రేటు పెరిగినట్లు.. హోటల్‌ రేట్లు పెంచేస్తే జనం ఊరుకుంటారా? ఊరుకోరు. వాళ్లను మాయ చేయాలి. ప్లేట్‌ ఇడ్లీని పాతిక వేలకు, ఫుల్‌ మీల్స్‌ని లక్ష రూపాయలకు అమ్మేయాలి. అమ్మేయాలనుకుంటే సరిపోతుందా? కస్టమర్లు తినేయాలను కోవద్దూ? అనుకోవడం ఏంటి? తింటున్నారు కూడా.

ఢిల్లీలోని ఓ  రెస్టారెంట్‌ రోజూ చేసే ఫుడ్‌ ఐటమ్స్‌నే చేస్తూ వాటి ముందు ‘ఆర్గానిక్‌’ అనే మాట చేర్చి కొత్త మెనూ కార్డులు ప్రింట్‌ చేయించి టేబుల్‌ మీద పెట్టింది. ఇక చూడండి.. ఆర్గానిక్‌ ఇడ్లీ, ఆర్గానిక్‌ వడ, ఆర్గానిక్‌ దోసె, ఆర్గానిక్‌ పూరీ, ఆర్గానిక్‌ మీల్స్‌ అంటూ సకల జనులు తిండి మీద పడి లాగించేస్తున్నారు. సంచుల కొద్దీ బిల్లులు సమర్పించుకుంటున్నారు. మరి ఆ రెస్టారెంట్‌లో ఆర్గానిక్‌ ఫుడ్‌ దొరుకుతోందని తెలియడం ఎట్లా? రెస్టారెంట్‌ బోర్డులో కూడా ఆర్గానిక్‌ అనే మాటను చేర్చారు. ఉదాహరణకు అది సుబ్బయ్య రెస్టారెంట్‌ అనుకోండి. ఆర్గానిక్‌ సుబ్బయ్య రెస్టారెంట్‌ని మార్చారు! సేమ్‌ ఫుడ్, సేమ్‌ ప్లేస్, సేమ్‌ కస్టమర్స్, సేమ్‌ క్వాంటిటీ ఆఫ్‌ ఈటింగ్‌. కానీ బిల్లే డబుల్, త్రిబుల్‌ అయ్యింది. మరి గుండె గుభేల్‌మనదా? మనదు. ఆర్గానిక్‌ కదా!

మరిన్ని వార్తలు