విప్లవం తర్వాత

17 Jun, 2019 00:37 IST|Sakshi

సాహిత్య మరమరాలు

రష్యా నాయకుడు నికిటా కృశ్చేవ్‌ ఒకసారి సైబీరియా ప్రాంత పర్యటనకు వెళ్లినప్పుడు, తొంబయి ఏళ్ల ముసలాయన దగ్గరకెళ్లి, ‘‘తాతయ్యా! మనదేశంలో జరిగిన సామ్యవాద విప్లవం తరువాత నువ్వు ఎంతో సంతోషంగా ఉన్నావు కదా!’’ అని అడిగాడట.

అందుకా ముసలాయన, ‘‘బాబూ! నాకా విప్లవం గురించి వివరంగా తెలియదుగానీ గతంలో అంటే అక్టోబర్‌ విప్లవానికి ముందు నాకు రెండు జతల బూట్లూ, రెండు పైన తొడుక్కునే కోట్లూ, రెండు ఉన్ని సూట్లూ ఉండేవి. ఇప్పుడు వాటిలో ఒక్కొక్కటే మిగిలాయి. అవైనా బాగా చిరిగిపోయాయి’’ అని చెప్పాడు వణుకుతున్న స్వరంతో.

ముసలాయన్ని ఎలాగైనా ఒప్పించాలని– ‘‘తాతయ్యా! నీకీ విషయం తెలుసా? చైనా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఇండియా మొదలైన దేశాల్లో ఉన్న ప్రజలకి నీకున్న సౌకర్యాలు కూడా లేక ఎంతో పేదరికంలో మగ్గిపోతున్నారు’’ అని వివరించాడు కృశ్చేవ్‌.

‘‘బహుశా ఆ దేశాల్లో మనకంటే ముందే అక్టోబర్‌ విప్లవం వచ్చుంటుంది’’ అన్నాడా వృద్ధుడు తాపీగా. 

-ఈదుపల్లి వెంకటేశ్వరరావు 

మరిన్ని వార్తలు